ఇందల్వాయి, జూన్ 9 : వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఎమ్మెల్సీ సొంతంగా ఆలయ ప్రహరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షల నిధులు అందజేశారు. పనులు పూర్తి కావడంతో ప్రహరీ వద్ద శిలాఫలకం ఆవిష్కరించి మాట్లాడారు. ఆలయాలపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో రాష్ట్రంలోని ఆలయాలకు రూ. 2వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశారన్నారు. ఎన్నికల సమయంలో మహిళలు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలుచేసేవరకూ తాను ముందుండి పోరాటం చేస్తానన్నారు. కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలు వురి పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్దకు వెళ్లి ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట నాయకులు మాజీ ఎంపీపీ రమేశ్‌నాయక్, పాశం కుమార్, మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, మాజీ సర్పంచులు నోముల లక్ష్మారెడ్డి, చందర్‌నాయక్, అంబర్‌సింగ్, విండో డైరెక్టర్ నామాల గంగాధర్, మాజీ డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశ్విని, మాజీ కో-ఆప్షన్ సభ్యులు కుర్షిద్ పాషా నాయకులు ఉన్నారు.