ఖలీల్వాడి, మార్చి 17 : మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని, మిర్చి పంటకు రూ.25వేల మద్దతు ధర కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలి ఆవరణలో మిర్చి దండలతో ప్రదర్శన చేపట్టి మాట్లాడారు. రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైనట్లు తెలిపారు. ధర లేక ఈ సీజన్లో 2 లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాలుకు రూ.25 వేలు నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చరిత్రలో నిలుస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కూడా సీఎం మహిళల పట్ల దురుసుగా మాట్లాడారని, ఆ రోజును చీకటి రోజుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.