బోధన్, నవంబర్ 2: తెలంగాణ ఉద్యమంలో యువత ముందు నడిచిందని, ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత ఎన్నికల్లోనూ కదం తొక్కి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్లో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహా యువగర్జన సభ’కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాకేంటని ఎవరికివారు అనుకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదని, తెలంగాణ కూడా వచ్చేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి, తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉందని తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి గుండెనూ తట్టి ఓట్లు వేయించాలని, షకీల్‌ను 50 వేల భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. యువగర్జనకు తరలివచ్చిన వేలాది మంది యువత ఉత్సాహం చూస్తుంటే.. బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిచేసి, ప్రజలకు సేవ చేస్తున్న షకీల్ గెలుపు ఖాయమైందన్నారు. ఇది ఎన్నికల తర్వాత జరుపుకొనే విజయోత్సవ సభలా కనిపిస్తున్నదని అన్నారు. కేసీఆర్ పథకాలు చేరని ఇల్లంటూ లేదని, ప్రతి ఇంటి నుంచి ఓట్లు వేయించాలని సూచించారు.
బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిస్తే ఇక పొద్దు పొడుసుడు ఉండదని, కేవలం పొద్దుగూకుడే అని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నీళ్ల మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ధనయజ్ఞానికి సహకరించారే తప్ప.. బోధన్ ప్రాంతానికి చుక్కనీరు కూడా తేలేదని విమర్శించారు. ఆయన సొంత గ్రామం సిర్నాపల్లి చెరువుకు షకీల్ రూ.53 లక్షలతో మరమ్మతు చేయించారన్నారు. అలాగే, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి స్వగ్రామం మోకన్‌పల్లిలో చెరువులను సైతం షకీలే బాగుచేయించారన్నారు. మోకన్‌పల్లి ప్రాంతానికి సీఎం కేసీఆర్ రూ.17 కోట్ల నిధులు ఇచ్చారని, సుదర్శన్‌రెడ్డి గ్రామానికి రూ.7 కోట్లు ఖర్చుపెట్టారని లెక్క చెప్పారు.
‘ప్రజా నాయకురాలంటే కవితక్కలా ఉండాలి.. ఆమె రుద్రమదేవి.. కవితక్క నాయకత్వంలో బోధన్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధిచెందింది’ అని యువగర్జన సభలో బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. కవిత నాయకత్వంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. ఆమె పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేయించారని, దీంతో బోధన్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. యువగర్జనలో జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్, బుద్దె రాజేశ్వర్, గోగినేని నర్సయ్య, భవానీపేట్ శ్రీనివాస్, దేవ, హరికృష్ణ, ప్రవీణ్ నాయక్, అడ్లూరి నరేశ్, జుబేర్, భరత్‌యాదవ్, సిరివేణు సంతోష్, రవిశంకర్‌గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చరిత్రలో ఎన్నడూలేని విధంగా నిరుద్యోగ యువతకు అత్యధిక ఉద్యోగాలను ఇచ్చింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కవిత స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కేవలం 24వేల ఉద్యోగాలే కల్పించారని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10 వేలు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంటే.. సీఎం కేసీఆర్ 2.32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్లు జారీ చేశారని, ఇందులో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీచేసుకోగా, భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించడం ప్రతిపక్షాలకు సాధ్యంకాదని, ఆయనను ఓడించాలంటే మళ్లీ కేసీఆరే పుట్టాలని కవిత అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.