తెలంగాణ బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ఖ్యాతిని దేశ నలుమూలలా చాటి చెప్పారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్గాం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పీవీ విగ్రహాన్ని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ పీవీ సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆయనకు గుర్తింపు ఇచ్చారన్నారు.
-ఖలీల్‌వాడి, ఆగస్టు 7
ఖలీల్‌వాడి, ఆగస్టు 7 : తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించి పీవీ ఖ్యాతిని దేశ నలుమూలలా చాటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ్రాహ్మణ సమాజం బోర్గాం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్సీ కవిత సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు.
సహజంగా తెలంగాణ వాళ్లు చేసింది చెప్పుకోవడానికి కొంత తటపటాయిస్తారని, పీవీ.నర్సింహారావు కూడా అంతేనన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడేవారని.. అది మామూలు మేథోసంపత్తి కాదని కొనియాడారు. అంత మేథోసంపత్తి ఉన్నా.. దేశ ప్రధాని అయినా తన ఆహార్యంలో ఎలాంటి మార్పు ఉండేది కాదన్నారు. పీవీ నర్సింహారావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నానన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవ్వరిదీ చిన్న పదవి కాదని, సమాజంలో అందరికీ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే కచ్చితంగా అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ముందుకు సాగితే పీవీ.నర్సింహారావు స్థాయికి ఎవరైనా చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉన్నదని పేర్కొన్నారు.
మహోన్నతమైన వ్యక్తి పీవీ నరసింహారావు
మహోన్నతమైన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభివాణీదేవి అన్నారు. పీవీ గురించి ఎంత చెప్పినా త క్కువే అని.. ఆయన చరిత్ర చదవాలని, ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అపర భక్తుడని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా బ్రాహ్మణ నిరుపేదలకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి రూ. 20 లక్షలు అందిస్తున్నారన్నారు. పూజారులకు రూ. 6 వేల నుంచి 10 వేలు వేతనం పెంచిన ఘనత ముఖ్యమంత్రిదేనని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ఠీవీ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
మెజారిటీ లేకున్నా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. పీవీ నరసింహారావు తెలంగాణకు మణిమాణిక్యమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.