MLA Venkataramana Reddy | కామారెడ్డి : కామారెడ్డి పట్టణ రింగు రోడ్డు మరియు నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నీతిన్ గడ్కరీని కామారెడ్డి ఎమ్మల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి ఔటర్ రింగు రోడ్డు విస్తరణ వివరాలను వెల్లడించారు. కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న రద్దీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రానికి 54 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు విన్నవించారు.
ఈ విషయమై కొనసాగింపుగా సాధ్యమైనంత తొందరగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని విన్నవించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని లింగాపూర్ స్టేజి నుండి మెడికల్ కాలేజీ, మైనారిటీ ఉమెన్ కళాశాల మీదగా జాతీయ రహదారి వరకు 4లైన్ రోడ్డు విస్తరణ కోసం రూ.40 కోట్లు, బిక్కనూర్ మండల కేంద్రం నుండు తిప్పాపూర్, తలమడ్ల మీదుగా రాజంపేట వరకు డబల్ రోడ్డు నిర్మాణం కోసం రూ.18 కోట్లు, పట్టణంలోని పాత బస్టాండ్ నుండి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.8 కోట్లు, పల్వంచ మర్రి నుండి మందాపూర్ మీదుగా భిక్నూర్ వరకు డబల్ రోడ్డు విస్తరణ కోసం రూ.24 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన అభ్యర్థనకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.