భీమ్‌గల్, ఆగస్టు 6: క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని, భీమ్‌గల్‌లో రాష్ట్రస్థాయి క్యారం పోటీలను నిర్వహించడం గర్వకారణమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మందుల హన్మాండ్లు స్మారక రాష్ట్రస్థాయి క్యారం ర్యాకింగ్ టోర్నీ ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ మారుమూల పట్టణమైన భీమ్‌గల్‌లో రాష్ట్రస్థాయి టోర్నీ నిర్వహించడం, టోర్నీలో సుమారు 200మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు.
కాలిఫోర్నియా లో అక్టోబర్‌లో నిర్వహించే వరల్డ్ కప్‌లో దేశం తరఫున పాల్గొనే ఎనిమిది మంది క్రీడాకారుల్లో తెలంగాణ నుంచి నలుగురు ఉండ డం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ క్యారం పోటీలకు తనవంతు సాయం చేస్తానని పేర్కొన్నారు. టోర్నీ నిర్వహణకు ముందుకొచ్చిన భీమ్‌గల్ వాసి, అంతర్జాతీయ క్రీడాకారుడు రవీందర్‌గౌడ్‌ను ఇతర క్రీడాకారులను అభినందించారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రథమ బహుమతి కె.శ్రీనివాస్, ద్వితీయ బహుమతి సూర్యప్రకాశ్, డబుల్స్‌లో ప్రథమ బహుమతి ఆదిత్య-జాఫర్, ద్వితీయ బహుమతి నరేశ్-వాసీం, మహిళల సింగిల్స్‌లో జయశ్రీ ప్రథమస్థానం లో నిలువగా అనిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో క్యారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత సురేందర్, మాజీ ఎంపీపీ మహేశ్, మాజీ జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, సొసైటీ చైర్మన్ నర్సయ్య, సీనియర్ క్రీడాకారులు సతీశ్, శ్రీనివాస్, వెంకట్‌నర్సయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త కర్నే మహేందర్‌ను ఎమ్మెల్యే వేముల పరామర్శించారు. ఇటీవల బెజ్జోరాలో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహేందర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మహేందర్ ఇంటికి వెళ్లిన వేముల.. ఆరోగ్య వివరాలను తెలుసుకొని, అండగా ఉంటామని భరోసానిచ్చారు.
భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.