వేల్పూర్, ఆగస్టు 17: రైతులందరికీ రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాఫీ చేసిందని, దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రైతుల్ని మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ రైతులతో వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద శనివారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాలో వేముల ప్రశాంత్‌రెడ్డి సతీమణితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులను నమ్మించి మోసం చేశాడని, గాలి మాటలు చెప్పి రైతులను మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారన్నారు. దేవుడు లాంటి కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రవ్యాప్తంగా రైతులను రోడ్డుపై కూర్చోబెట్టిన ప్రభుత్వం మీదని, రైతును రాజును చేసేందుకు రైతువేదికలు కట్టిన ప్రభుత్వం మాదని అన్నారు. రేవంత్‌రెడ్డి రూ.2లక్షలు మాఫీ చేస్తానని నమ్మించి మోసం చేసి ఓట్లు వేసిన ప్రజల గొంతు కోశారన్నారు.
డిసెంబర్ 9వరకు మాఫీ అని చెప్పి మాట తప్పారని, రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో ప్రశ్నిస్తే వంద రోజుల్లో చేస్తామన్నారు. మాఫీ కానీ రైతులు కలెక్టరేట్‌కు పోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. ధర్నా సందర్భంగా పోలీసుల తీరుపై మంత్రి స్పందించారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నామని, వచ్చే ప్రభుత్వం తమదేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని పోలీసులు హద్దు మీరితే తాను రెడ్ డైరీ మెయిన్టైన్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే గుణపాఠం చెప్పక తప్పదన్నారు.