మోర్తాడ్, జనవరి 5: గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన పనులు తప్ప, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికాలంగా ఎలాంటి పనులు కొనసాగడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మానాల-మరిమడ్ల రోడ్డును స్థానికులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మానాల -మరిమడ్ల రోడ్డుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. అటవీశాఖ క్లియరెన్స్ తీసుకొచ్చి పనులు ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు తప్ప, కాంగ్రెస్ సర్కార్ హయాంలో పనులు కొనసాగడం లేదన్నారు. మానాల-మరిమడ్ల రోడ్డు ఈ గ్రామస్తుల చిరకాల కోరిక అని తెలిపారు. తాను మానాల వచ్చిన ప్రతిసారి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరేవారని గుర్తుచేశారు. మానాల-మరిమడ్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.