ముప్కాల్/ మెండోరా/ ఏర్గట్ల, అక్టోబర్ 10: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి కింద ఇచ్చే రూ. లక్ష ఇస్తున్నారే తప్ప.. తులం బంగారం ఇవ్వడంలేదని మండిపడ్డారు. తులం బంగారం ఎప్పుడిస్తారని సీ ఎం రేవంత్‌రెడ్డిని వేముల ప్రశ్నించారు. గురువారం ఆయన ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాలం దగ్గర పడుతున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలుచేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశా రు. ఆడబిడ్డల కుటుంబాలకు అండ గా నిలబడాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఎంతో మంది పేద ఆడబిడ్డల కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన లక్ష రూపాయలు మాత్రమే ప్రస్తుత రేవంత్ సర్కా రు ఇస్తున్నదని, తులం బంగారం మాత్రం ఇవ్వడంలేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.
ముప్కాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు సభను అడ్డుకునే యత్నం చేశారు. తులం బం గారం ఎక్కడ అని వేముల ప్రశ్నించడంతో సభను రసాభాసగా మార్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలను బయటికి పంపించారు. ఇదిలాఉండగా.. ఏర్గట్లలో చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు రైతువేదిక ఆవరణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు.