మోర్తాడ్/ముప్కాల్(బాల్కొండ), అక్టోబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే అనేక కొర్రీలు పెడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఆంక్షలు పెట్టి రుణమాఫీని గోల్మాల్ చేశారని, రైతుభరోసాను ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రైతురాజ్యం ఉంటే, కాంగ్రెస్ హయాంలో రైతాంగం ఆగమాగవుతున్నదని తెలిపారు.
శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపపిల్లలను విడుదల చేసిన ప్రశాంత్‌రెడ్డి.. కమ్మర్పల్లి మండలంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న రెండు గోదాములకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పొరపాటున వేరే ప్రభుత్వం వస్తే రైతుబంధుకు రాంరాం చెప్తారని కేసీఆర్ ముందుగానే చెప్పారని, ఆయన చెప్పినట్లుగా రేవంత్ సర్కారు రైతుబంధును ఎగ్గొట్టిందన్నారు.
వానకాలం రైతుభరోసా ఇస్తామని కాలం వెళ్లదీసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇవ్వబోమని చావుకబురు చల్లగా చెప్పిందన్నారు. పైగా ఎండాకాలానికి సంబంధించి మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చాక ఇస్తామంటున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు ఠంచన్‌గా రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. డిసెంబర్ 9న రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పది నెలలైపోయింది. 30 శాతం మందికి మాత్రమే మాఫీ చేసి, మిగతా వారికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దళారుల చేతుల్లో మోసపోతున్న గంగపుత్రులను ఆదుకునేందుకే కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీని ప్రారంభించారని వేముల చెప్పారు. దీనివల్ల వేలాది గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక చేపపిల్లల పంపిణీని సగానికి తగ్గించిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఏటా ఎస్సారెస్పీ లో 62 లక్షల చేప పిల్లలు వదిలామని, కానీ ఈసారి 31 లక్షలు మాత్రమే వదులుతున్నట్లు తెలిపారు.
గతంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.42 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేస్తే, ఈసారి కాంగ్రెస్ సర్కారు 2.20 కోట్లు మాత్రమే పంపిణీ చేసిందన్నారు. ఖజానాలో డబ్బులు మిగుల్చుకునేందుకు గంగపుత్రుల పొట్ట కొట్టొద్దని, వారిని ఆదుకోవాలని ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గంగపుత్రుల కోసం తాము సర్కారుతో కొట్లాడుతామని చెప్పారు. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, సొసైటీల చైర్మన్లు రేగుంట దేవేందర్, బాపురెడ్డి, గడ్డం స్వామి, నేతలు పాల్గొన్నారు.