భీమ్‌గల్, సెప్టెంబర్ 29 : ఆరోగ్యకర జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కృషి హైస్కూల్ గ్రౌండ్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల అంతర్ పాఠశాలల క్రీడాపోటీలు నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేముల హాజరయ్యారు. క్రీడాజ్యోతి వెలిగించి, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసం, ఆరోగ్యకరమైన జీవితం, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతోగానో ఉపయోగపడుతాయన్నారు.
క్రీడలు కేవలం ఫిట్నెస్ కోసమే కాకుండా జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిబ్బరంగా, మనోధైర్యంగా ఉండడానికి ఉపయోగపడుతాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు క్రీడల్లో పాల్గొనడమే అదృష్టంగా భావించాలని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. అప్పుడే క్రీడా స్ఫూర్తి విద్యార్థుల్లో అలవడుతుందన్నారు. తనతోపాటు చిన్నప్పుడు ఆడిన ఎందరో ఇప్పుడు జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లుగా ఉన్నారని, వారికి క్రీడలపై ఉన్న మక్కువతోనే జిల్లాలో గ్రామీణ స్థాయిలో గొప్పగా క్రీడలు నిర్వహించుకోగలుతున్నామని తెలిపారు.
గ్రామీణస్థాయి నుండి క్రీడల్లో రాణించి రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడినవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తల్లి దండ్రులు ఎల్లప్పుడూ చదువు, మార్కులే కాకుండా పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. పోటీల నిర్వహణ కోసం బహుమతులు, ఇతర అవసరాలకు దాతగా ముందుకొచ్చిన పద్మ జగదీశ్‌ను అభినందించారు. తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి 30 ఏండ్లుగా క్రీడల్లో రాణించారని తెలిపారు. అనంతరం మార్చ్‌పాస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, మాజీ జడ్పీటీసీ రవి, మున్సిపల్ వైస్‌చైర్మన్ భగత్, కౌన్సిలర్లు సతీశ్, లింబాద్రి, ప్రసా ద్, లింగయ్య, ఎంఈవో స్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, ఫిజికల్ డైరెక్టర్లు విద్యాసాగర్‌రెడ్డి, రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.