ముప్కాల్/ భీమ్‌గల్, ఏప్రిల్ 25: గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ముప్కాల్ మండలంలోని నాగంపేట, నల్లూర్తోపాటు భీమ్‌గల్ మండలం చేంగల్,బడా భీమ్‌గల్ గ్రామాల్లో నిజామాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నాగంపేట్లో పంచాయతీ ఆవరణలో ఓ చెట్టుకింద కూర్చొని రైతులతో ముచ్చటించారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పనులు కొనసాగే ప్రదేశానికి వెళ్లి కూలీలతో భేటీ అయ్యారు. సాయంత్రం భీమ్‌గల్ మండలం చేంగల్, బడా భీమ్‌గల్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కల్లబొల్లి మాటలు, ఆరు గ్యారెంటీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఒకే హామీని నెరవేర్చిందన్నారు. మిగతా ఐదు గ్యారెంటీలను త్వరలో తప్పక అమలుచేస్తామంటూ నమ్మిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుబీమా, రుణమాఫీ, పెట్టుబడి సాయం, మహిళలకు పెన్షన్, వరికి బోనస్ ఇవ్వకుండా నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15న అంటూ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్ మళ్లీ బోర్డుపేరుతో మోసం చేయడానికి వస్తున్నాడని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించే గొంతుక, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ ముప్కాల్, భీమ్‌గల్ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, నర్సయ్య, సీనియర్ నాయకులు బద్దం నర్సారెడ్డి, గంగాధర్, సత్యనారాయణ, శ్రీనివాస్, భీమ్‌గల్ ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, విండో చైర్మన్ నర్సయ్య, జిల్లా నాయకులు కన్నె సురేందర్, మండల నాయకులు శర్యా నాయక్, తుక్కాజి నాయక్, సర్పంచులు సంజీవ్, గంగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.