మోర్తాడ్, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల కష్టాల కన్నా, అందాల పోటీలు ముఖ్యమయ్యా యా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి కూడా సమయం లేని సీఎం అందా ల పోటీల విషయంలో ఎనిమిది సార్లు సమీక్ష నిర్వహించడాన్ని బట్టి చూస్తే రైతులపై ఎంతనిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతుందన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, అవన్నీ ఉట్టిమాటలే అని శనివారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా కల్లాల వద్ద, రహదారులపై ధాన్యపు రాసులు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్న రైతులు
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ధాన్యం నీటిపాలు అవుతున్నదని మండిపడ్డారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని రైతులు గోడు వెళ్లబోసుకుంటూ…గతంలో కేసీఆర్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కల్లాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం కూడా రైస్ మిల్లులకు తరలించడానికి సకాలంలో లారీలు ప్రభుత్వం పంపకపోవడంతో ధాన్యం నీటిపాలు అవుతున్నదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రైస్‌మిల్లులకు చేరిన ధాన్యం నుంచి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్రనష్టం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి క్వింటాలుకు రూ.500బోనస్ త్వరగా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోతున్న సజ్జలు, ఇతర పంటల రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.