హైదరాబాద్/మోర్తాడ్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా.. ‘మా చెల్లికి పెండ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో జనవరిలోనే ప్రారంభించిన పసుపుబోర్డు తాతాలిక కార్యాలయాన్ని మరొక కిరాయి భవనంలోకి మార్చి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో మళ్లీ ప్రారంభిస్తుంటే జిల్లా పసుపు రైతులు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
పసుపు రైతులకు కావాల్సింది తాతాలిక కార్యాలయాలను మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ ఏమార్చడం కాదని, పసుపు పంటకు మద్దతు ధర అని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ సభలో అమిత్‌షా ప్రసంగంలో రాజకీయ అంశాలు తప్ప పసుపునకు మద్దతు ధర, పసుపుబోర్డుకు నిధులు, శాశ్వత భవనంపై ప్రస్తావనే లేదని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో రబ్బర్బోర్డు, స్పైసెస్‌బోర్డు వంటి ఇతర బోర్డులకు నిధులు కేటాయించినట్టుగా నిజామాబాద్ పసుపుబోర్డుకు రూపాయి కూడా కేటాయించలేదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిధులు లేకుండా, ఈ బోర్డు రైతులకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. అందుకే మొన్న సీజన్లో పసుపు ధర రూ.8వేల నుంచి రూ.పదివేలు మాత్రమే పలికిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు బీజేపీపై కోపంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఉన్నట్టుండి పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి బీజేపీ తెర తీసి మళ్లీ డ్రామా ఆడిందని విమర్శించారు.
పార్లమెంట్లో పసుపు బోర్డుపై ప్రైవేట్ బిల్లు పెట్టిన ఎంపీ సురేశ్‌రెడ్డిని, తనను కూడా కార్యక్రమానికి పిలువ లేదని, ఏదో నామమాత్రంగా నిన్న రాత్రి కార్డు పంపించారని చెప్పారు. తాతాలిక కార్యాలయంగా కూడా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే బోర్డుకు దికయ్యిందని, దానినే అద్దె ప్రాతిపదికన కిరాయి తీసుకొని ఉపయోగించడం బీజేపీ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. వాణిజ్య పంటల బోర్డును ఏర్పాటుచేస్తే సిబ్బంది, కార్యవర్గం, నిధులు ఉంటాయని, కానీ, ఇప్పటివరకు పసుపుబోర్డుకు చైర్మన్, సీఈవోను మాత్రమే నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పసుపుబోర్డు ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని, సిబ్బంది, పాలకవర్గాన్ని నియమించడంతోపాటు సరిపడా నిధులు కేటాయించాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పసుపుకి క్వింటాలుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించేవిధంగా బోర్డు ప్రయత్నం చేయాలని లేకుంటే కార్యాలయం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని చెప్పారు.
దేశంలో జీడి, కొబ్బరి, కాఫీ బోర్డులు, ఆయా పంటల ధరలు తగ్గినప్పుడు అవే స్వయంగా పంటను ఎంఎస్పీకి కొని అంతర్జాతీయ మారెట్లోకి ఎగుమతి చేస్తాయని, పసుపుబోర్డు కూడా అలాగే వ్యవహరించాలని కోరారు. అప్పుడే బోర్డు ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. వచ్చే సీజన్ నుంచి పసుపు పంటకు ఎంఎస్పీ ప్రకటించి, క్వింటాలుకు రూ.15 వేలు మద్దతు ధర ఇచ్చి పసుపు బోర్డే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ పసుపుబోర్డు, పసుపునకు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేశారని, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు పోరాటంతో రైతులు జాగృతం అయ్యారని వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. 2014 నుంచి 2018 వరకు అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేగా తాను పోరాటం చేసినా కేంద్రం సహకరించలేదని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటుచేస్తామని, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామంటూ బాండ్ పేపర్ రాసి బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చి గెలిచారని తెలిపారు.
2022లో పసుపు బోర్డు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటుచేస్తామని కేంద్రం ప్రకటించడాన్ని రైతులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాజకీయంగా బీజేపీకి ఇబ్బందికరమని భావించి 2023 అక్టోబర్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్ సభలో పసుపుబోర్డు ఏర్పాటుచేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని చెప్పారు. చివరికి 2025 జనవరి 14న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును ప్రారంభించారని తెలిపారు. బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని చైర్మన్‌గా నియమించారని, అప్పటికే కిరాయి భవనంలోనే కొనసాగుతున్న స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తాతాలిక జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా మార్చారని తెలిపారు.