నిజామాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నిబంధనలను బుట్టదాఖలు చేస్తున్నారు.
చెడు సంస్కృతికి బాటలు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు కలెక్టర్లు, అధికారులంతా బహిరంగంగానే ఊడిగం చేస్తుండడం జనాల్ని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. నిబంధనలు, ప్రొటోకాల్ మర్యాదలు పాటించాల్సిన వ్యక్తులే అధికార పార్టీ నేతలకు ఎర్ర తివాచీ పరిచి రాచ మర్యాదలు చేస్తుండడంపై విమర్శలకు తావిస్తున్నది. రెండ్రోజుల క్రితం నవంబర్ 29న కలెక్టరేట్లో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, రోడ్లు భవనాల శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
వీరికి తోడుగా వేదికపై కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఆసీనులు కావడం చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు. ప్రజలతో తిరస్కరించబడిన వ్యక్తులు దర్జాగా తమకేం తక్కువ అన్నట్లుగా రెచ్చిపోయి వేదికను అలంకరించారు. సాక్షాత్తూ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఎదుటే ఈ తంతు జరగడం విశేషం. అనధికార వ్యక్తులను దూరం పెట్టాల్సి ఉండగా, తన పక్కనే కూర్చోబెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించారు. ఈ విషయంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం తీరును ప్రజలంతా తప్పు పడుతున్నారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశానికి బాల్కొండ, ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్‌రెడ్డి, పొద్దుటూరి వినయ్రెడ్డిలను ఆహ్వానించడాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. కలెక్టరేట్లో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారంటూ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన కలెక్టర్ ఎదుటే ఉల్లంఘనలు జరిగాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రమూ సహించడానికి వీలు లేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్, సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేముల సీఎస్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి అనధికారిక వ్యక్తులను అధికారిక కార్యక్రమాల్లో ప్రోత్సహించకుండా జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. ఈ ఫిర్యాదుపై సీఎస్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.