పెద్దకొడప్గల్, నవంబర్ 18: సోయా కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టిన యంత్రాంగం ఎట్టకేలకు పంట కొనుగోళ్లకు ముందుకొచ్చింది. సోయా రైతుల అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 10న ప్రచురించిన కథనానికి మార్క్ఫెడ్ స్పందించింది. పెద్దకొడప్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోయా కొనుగోలుకేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. కొనుగోలు కేంద్రాలు లేక, ప్రైవేట్లో తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో మహారాష్ర్టలోని ఉద్గిర్ మార్కెట్కు సోయాపంటను తరలిస్తున్న అంశాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఎత్తిచూపింది. ఈకథనంపై అదేరోజు స్పందించిన ఉన్నతాధికారులు నివేదిక సమర్పించాలని పెద్దకొడప్గల్ సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనించిన ప్రభుత్వం.. ఎట్టకేలకు కొనుగోలు కేందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతోస్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోమవారం కేంద్రాన్ని ప్రారంభించారు. సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటయ్యేందుకు దోహదపడిన ‘నమస్తే తెలంగాణ’కు రైతులు అభినందనలు తెలిపారు. సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి, వైస్ చైర్మన్ సంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.