కంఠేశ్వర్, సెప్టెంబర్ 18: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష నిర్వహించారు.
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు.గడిచిన మూడేండ్ల నుంచి పదో తరగతి పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని తెలుసుకున్నారు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు, మండల ప్రత్యేకాధికారులు హాస్టళ్లను తనిఖీ చేసిన సమయంలో గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన, సరైన వసతి సదుపాయాలను కల్పించాలన్నారు. ఆకస్మిక తనిఖీ చేపట్టి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.