నందిపేట్, జనవరి 11 : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పనితీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలుచేయకుండా హైదరాబాద్‌కే పరిమితమైన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే మాటల్లోనే దూకుడుగా కనిపిస్తున్నాడని, అభివృద్ధి పనుల్లో మాత్రం కనిపించడంలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేను నిలదీస్తూ వైరల్ అవుతున్న పోస్టులు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు షేర్ చేస్తున్నారు.
తాను అందరి కన్నా ఎక్కువగా మాట్లాడుతాననే ముద్ర వేసుకునేందుకు ఉబలాటపడుతున్న రాకేశ్‌రెడ్డి, పదవిలోకి వచ్చి ఏడాది కాలమైనా నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. తన సొంత పనుల కోసమే సమయాన్ని కేటాయిస్తూ ప్రజాపాలనను గాలికివదిలేశాడని పేర్కొన్నారు. అంతేగాక తాను గెలిచిన తరువాత రూపాయికే వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చాడని, ఇప్పుడు ఆ ఒక్క రూపాయి వైద్యం ఎటుపోయిందంటూ ప్రశ్నించారు.
యువతకు ఉపాధి ఎక్కడ అని, సొంతంగా ఇండ్లు కట్టిస్తానని ఒక్కఇల్లు కట్టించలేదని, ఉపాధి కోసం నిరుద్యోగ యువకులను విదేశాలకు పంపుతానని సమాచారం సేకరించి ఏం చేశాడని, హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి ఎవరూ రావద్దంటూ సామాన్యులకు దూరంగా ఉంటున్నాడంటూ పోస్టు చేశారు. ప్రభుత్వ అధికారులతో దురుసు మాటలు, ధనవంతులు తన ఇంటికి రావద్దంటూ, పేదవాడు వస్తే మాత్రం సహాయం చేయడం లేదని పేర్కొంటూ సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తూ తయారుచేసిన పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. రెండురోజులుగా వైరల్ అవుతున్న ఈ పోస్టులపై నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది. పార్టీలకు అతీతంగా ఈ పోస్టును వైరల్ చేస్తుండడం గమనార్హం.