బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 25: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ వచ్చి కొనుగోలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కాంటా వేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసిందని అన్నారు.
రైతులు పండించిన పంటను సగం వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత గానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదన్నారు. కాంటా జరిగి రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు అందడం లేదంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి పోచారం వచ్చినట్లు తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఆయన వద్దకు చేరుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను పోచారం దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలకు నేలకొరిగిన పంట విషయంలో ప్రభుత్వ స్పందన సరిగ్గా లేదని, కొనుగోలు కేంద్రాలను కూడా సరిగ్గా ఏర్పాటు చేయడంలేదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని పోచారం హెచ్చరించారు.