బాన్సువాడ టౌన్, మార్చి 14: నిస్వార్థమైన కార్యకర్తలు తోడు ఉండగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉన్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ గురువారం ఎమ్మెల్యే పోచారాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన అనిల్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయంపై పూర్తి అవగాహన లేని కొందరు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమీ లేదని, చెత్తంతా పోగా నిజమైన కార్యకర్తలు, నాయకులు పార్టీకి ఎళ్లవేళలా అండగా ఉంటారని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ మెజారిటీతోనే గెలుపొందామని, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్‌కు, మతపరమైన ద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడిపే బీజేపీకి ముచ్చెమటలు పట్టడం ఖాయమన్నారు.
కామారెడ్డి,మార్చి 14: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌ను జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ గురువారం కలిశారు. తన విజయానికి సహకరించాలని కోరారు.