కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ శత్రువులు. సంపద పెంచడం, పేదలకు పంచడమే కేసీఆర్‌కు తెలుసు. దేశాన్ని ముంచడమే మోదీకి తెలుసు. దేశాన్ని పోషిస్తున్న ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటైతే.. సొమ్ము రాష్ర్టాలది, సోకు మోదీది అన్నట్లుగా మారింది. పిల్లలు తాగే పాలపైనా జీఎస్టీ విధించిన ఘనుడు మోదీ. బుద్ధిలేని రెండు ప్రమాదకర జాతీయ పార్టీలతో మనం యుద్ధం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లోనూ చెడుపై మళ్లీ మంచే గెలవాలి. కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపే తెలంగాణకు నిజమైన పండుగ కావాలి.
మాక్లూర్, మే 30: సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్ అని, సంక్షేమ పథకాలు అత్యధికంగా అమలు చేస్తున్న కేసీఆర్‌లాంటి దమ్మున్న సీఎం దేశంలోనే లేరని వివరించారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి సమీపంలో ఉన్న వంజరి సంఘం ఫంక్షన్హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత కరెంటొచ్చిందని, ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీళ్లొచ్చాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపడ్డాయని, ఆ చెరువుల్లో చేపలు పెరుగుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగొచ్చిందని, గొర్రెల సంపదతో గొల్లకురుమల వాకిళ్లు కళకళలాడుతున్నాయని వివరించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండిళ్ల్లు జరుగుతున్నాయని తెలిపారు. భారీ పరిశ్రమలొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని, పల్లె, పట్టణాలు ప్రగతి సాధించాయని, దండుగన్న వ్యవసాయం పండుగైందని వివరించారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కీర్తి గడిస్తోందని, కేసీఆర్ ప్రధానమంత్రి కావలన్నదే నా జీవితాశయమని వెల్లడించారు. ఆయన సారథ్యంలోనే అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలవుతాయన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఏపీతో సహా అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారని అన్నారు. ఎంపీ అర్వింద్ జిల్లాకు పట్టిన శని అని, కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ చావుకోరే కాలకేయులన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కాళ్లు కడిగి నా నెత్తిన చల్లుకున్నా వారి రుణం తీర్చుకోలేనిదని జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, సమష్టిగా కృషిచేసి మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని కోరారు. తాను మీ బిడ్డనని మళ్లీ ఆశీర్వదించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.