ఖలీల్‌వాడి, అక్టోబర్ 4 : సీఎం కేసీఆర్ కుటుంబంపై అనవసరంగా నోరు పారేసుకుంటే బట్టలూడదీసి కొడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెచ్చరించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్‌కు అది పొలిటికల్‌గా ఎండ్ పేపర్‌గా మారిందన్నారు. అందుకే చెత్తబుట్టలో పడేసిన బాండ్ పేపర్‌తో మరోసారి ఎన్నికల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. అయినా బీజేపీని ఇక రైతులు నమ్మే స్థితిలో లేరని అన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రధాని, ఎంపీపై నిప్పులు చెరిగారు. జిల్లాలో అర్వింద్ ఎక్కడ కనబడినా తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ముంటే ఆర్మూర్‌లో తన మీద పోటీ చేయాలని, డిపాజిట్ కూడా దక్కనివ్వనని సవాల్ విసిరారు. బీజేపీ కమలదళం కాదని, హమ్లా దళమని పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంపై గుజరాతీ గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ బాహర్ వాలా అని.. కేసీఆర్ ఘర్‌వాలా అని అన్నారు. ఇక్కడ మోదీ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. సూటూ, బూటు, నోటు, ఓటు.. మోదీ సిద్ధాంతమని, నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ సిద్ధాంతమని అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం అని తెలిపారు. పసుపు బోర్డు ఓ ఎన్నికల నాటకమని, పవిత్రమైన పసుపును బజారుకీడ్చిన బీజేపీ మట్టి కొట్టుకుపోతుందన్నారు. దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని తెలంగాణలో ఒక్క చోటకూడా డిపాజిట్ రాదన్నారు.
కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం తొక్కని గడపలేదని, మొక్కని దేవుడు లేదని గుర్తుచేశారు. నిన్నటి వరకు ఇవ్వలేమన్న పసుపుబోర్డు.. ఇప్పుడెలా సాధ్యమైందని ప్రశ్నించారు. రైతులపై ప్రేముంటే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై మోదీ విషయం కక్కని రోజు లేదని, తెలంగాణ చావు చూసే దాకా నిద్ర పోకూడదన్నంత ద్వేషం పెంచుకున్నాడని ఆరోపించారు. ఓట్లు దండుకోవడానికే నేడు తెలంగాణలో ఊరేగుతున్నాడని ఎద్దేవా చేశారు. సింగరేణి గనులు సహా పదేండ్లుగా సీఎం కేసీఆర్ సృష్టించిన అపారమైన సంపదను అదానీకి దోచిపెట్టాలనే దుర్బుద్ధి మోడీలో కనిపిస్తున్నదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ ఒక డర్టీ పిక్చర్ అన్నారు. ఎలక్షన్ మూవీలో మోదీ అనేక వేషాలేస్తున్నారని ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదని, మోదీ మాటల్లో నిజం ఉండదని విమర్శించారు.