కల్లాలు కట్టుకుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్షకులు కన్నెర్ర చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కారుపై కక్షగట్టిన మోదీపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కల్లాల డబ్బులను వాపస్ ఇవ్వమనడంపై ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన రైతు మహాధర్నాకు అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ప్రజాప్రతినిధులు, నాయకులు నిప్పులు చెరిగారు. కల్లాలను అడ్డుకుంటే రైతులు ఊరుకోరని, బీజేపీ వాళ్ల గల్లాలు పట్టుకుంటారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పోరాటంతో మోదీ మోసాలకు పుల్‌స్టాప్ పడనుందన్నారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన రైతు ధర్నా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ఆకుల లలిత, మేయర్ నీతూకిరణ్, నేతలు పోచారం సురేందర్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీరును ఎండగట్టారు.
– నిజామాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మోదీ పాలనలో వ్యవసాయానికి గాయం తప్ప సాయం లేదని, రైతుకు దుఃఖం తప్ప సుఖం లేదని, దగాపడిన రైతు చూపు కేసీఆర్ వైపు చూస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాన్‌స్టాప్ ఉద్యమాలతోనే మోదీ మోసాలకు ఇక పుల్‌స్టాప్ పడుతుందన్నారు. బీజేపీ పాలనలో కరెంట్ లేక చీకట్లు, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు అన్నట్లుగా మారిందని జోస్యం చెప్పారు. మోదీ కార్పొరేట్ రక్షకుడు… కర్షక భక్షకుడని మండిపడ్డారు. మాది రైతు సిద్ధాంతం.. బీజేపీది ఓట్ల కోసం రాద్ధాంతమంటూ విమర్శించారు. కేసీఆర్ మాట రైతు రాజయ్యే బాట.. రైతు వ్యతిరేక మోదీ ముఠా గో బ్యాక్ అంటూ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో నినదించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మేయర్ నీతూకిరణ్, బాజిరెడ్డి జగన్, పోచారం సురేందర్ రెడ్డితో కలిసి పాత కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఉపాధి హామీ నిధులతో రైతులు నిర్మించుకున్న కల్లాల డబ్బులను వాపస్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖను ఇవ్వడంపై అన్నదాతలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు.
విద్యానగర్,డిసెంబర్ 23 : రైతులపై విషం చిమ్మే ఏకైక ప్రధాని మోదీ అని, ఎన్ని కుతంత్రాలు చేసినా బీజేపీకి తలొగ్గేది లేదని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతుమహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో రాజకీయ వ్యవస్థ అస్తవ్యప్తంగా మారిందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతో కేసీఆర్ కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చారన్నారు. కుదుటపడుతున్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలు కుంటుపడేలా చేస్తున్నాయని విమర్శించారు. మోదీకి తెలంగాణ రైతులు కనబడడం లేదా?.. కుళ్లు బుద్ధితో తెలంగాణపై విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. వడ్లు ఆరబోసేందుకు రైతులు కల్లాలు నిర్మించుకుంటే.. నిధులు వాపస్ చేయాలని కేంద్రం నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రైతుబంధు పార్టీ అయితే బీజేపీ రైతు రాబంధు పార్టీ అని మరోసారి రుజువైందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న మోదీ.. సేద్యానికి గోరి కడుతున్నాడని చెప్పారు. బీజేపీ ముమ్మాటికీ గుజరాతీ బేరగాళ్ల పార్టీయే తప్ప రైతులను ఉద్దరించే పార్టీ కాదన్నారు. ఈ బేరగాళ్లకు తెలంగాణలోని బీజేపీ నేతలు అర్వింద్, సంజయ్ లాంటోళ్లు చెంచాగిరి చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతులపై మోదీ సర్కారు కక్షపూరితంగా కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లో కల్లాలు కట్టుకోవడం రైతులు చేసిన పాపమా? అంటూ ప్రశ్నించారు. కల్లాలు కట్టుకోవడం రైతులు చేసిన తప్పైతే, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచేస్తున్న మోదీ తీరు దేనికి సంకేతమని అన్నారు.
సాగునీటి రాకతో సేద్యం పెరిగి తెలంగాణలో పనులు పెరిగాయని, ఇతర రాష్ర్టాల నుంచి భారీగా వలస వస్తున్నట్లు జీవన్‌రెడ్డి వివరించారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత వస్తుందని గ్రహించి వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2014, 2019లో బీజేపీ మేనిఫెస్టోలో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. 60ఏండ్లు నిండిన రైతులకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కల్లాల నిర్మాణానికి అడ్డుపుల్లలు వేస్తున్న బీజేపీ గల్లాలు పట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు తెచ్చి రైతులను కార్లతో తొక్కించి తుపాకులతో కాల్చి చంపారన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను, దమననీతిని రైతులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
దేశానికి అన్నం పెట్టే రైతులంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకింత కక్ష అంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రశ్నించారు. అన్నదాతలపై బీజేపీకి ప్రేమ లేకపోగా ద్వేషం ఎందుకని రైతు మహాధర్నాలో ప్రసంగిస్తూ అన్నారు. మోటర్లకు మీటర్లు పెడతామంటూ, మద్దతు ధర ఇవ్వబోమంటూ, బోర్లకు ఉచిత కరెంట్ తీసేస్తామంటూ, కల్లాలు కట్టుకుంటే నిధులు వెనక్కి ఇవ్వాలంటూ ఇంతగా వెంటపడి ఇబ్బందులకు గురిచేయడం దేనికి సంకేతమని అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు స్థలాలు సరిపోవడం లేదన్నారు. రోడ్లపై ఆరబోయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని గుర్తు చేశారు. కల్లాల నిర్మాణానికి కేసీఆర్ వినూత్నమైన ఆలోచన చేసి రైతులకు మేలు చేస్తే, బీజేపీ ప్రభుత్వానికి రుచించకపోవడం విడ్డూరంగా మారిందన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాబోయే ప్రభుత్వం కిసాన్ ప్రభుత్వమేనని కుండబద్దలు కొట్టారు.
కేసీఆర్ రైతు బాంధవుడు. రైతు సంక్షేమం కోసం 24గంటలు ఆలోచించే గొప్ప నాయకుడు. 8సంవత్సరాల క్రితం తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల ఉచిత కరెంటును అందించిన గొప్పనాయకుడు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను మూడేండ్లలో పూర్తి చేసి యావత్ తెలంగాణ రైతులకు సాగునీరందిస్తున్నాడు. పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకుంటే.. ప్రధాని మోదీ హింసిస్తున్నాడు.
– హన్మంత్‌షిండే, ఎమ్మెల్యే, జుక్కల్
రైతులు సంబురాలు చేసుకునే రోజుల్లో.. రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేసేలా ప్రధాని మోదీ చేశారు. రైతులు పండించే పంటలను ఆరబోసేందుకు కల్లాలు నిర్మించుకుంటే, ఉపాధి హామీ కింద వాడుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకవచ్చి రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది.
– పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
రాష్ట్రంలోని రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం రైతులకు వ్యతిరేకంగా ఎనిమిదిన్నర సంవత్సరాలుగా సిగ్గులేకుండా పనిచేస్తుంది. రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఆవిష్కరణ.
– వీజీగౌడ్, ఎమ్మెల్సీ
తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వమే. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు కావడం, రైతులకు మేలు జరుగుతుండడంతో ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్లాల నిధులు వెనక్కి తీసుకునేందుకు చూస్తున్నది. రైతులను ఇబ్బంది పెట్టడంలో బీజేపీ ముందుంటుంది.
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న రైతు కల్లాల విషయంలో మోదీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. నిధులు వాపస్ పంపాలని నోటీసులు పంపించడం సరికాదు..
– దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ చైర్మన్, నిజామాబాద్
దేశంలోని రైతులకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీనే. రైతు బాగుండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కేంద్ర చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి బుద్ధి చెప్పే త్వరలోనే రోజులు వస్తాయి.
– బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ, ధర్పల్లి