మద్నూర్, ఏప్రిల్ 11: భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిరుపేద, బడుగు, బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేశామని,మరో 11 గ్రామాలకు రోడ్లు వేయాల్సి ఉందని వాటికి త్వరలో మంజూరు వస్తుందని తెలిపారు.
మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటవుతుందని, అందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉన్నట్లు చెప్పారు. రూ.476 కోట్లతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నాలుగు మండలాల పరిధిలోని 40వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని వివరించారు. మద్నూర్, బిచ్కుంద ప్రాంతాల రైతులకు మరో లిఫ్ట్ కోసం రూ.200కోట్లు అడిగామని, లిఫ్ట్ నిర్మాణంతో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుందామని చెప్పారు. అనంతరం ఆయా గ్రామాల నాయకులతో విడివిడిగా మాట్లాడి వారి గ్రామానికి ఇంకా ఏం అవసరం ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాబోయే ఎన్నికల్లో వారికి అండగా ఉంటూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే షిండే గులాబీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, జడ్పీటీసీ అనిత, సొసైటీ చైర్మన్ శ్రీనుపటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దరాస్ సురేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, నాయకులు మోయిన్పటేల్, బస్వరాజ్పటేల్, పండిత్రావుపటేల్, విజయ్‌కుమార్, కాశీనాథ్పటేల్, పప్పుసేట్, విఠల్, రాజు, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.