ఖలీల్‌వాడి, ఏప్రిల్ 11: అభివృద్ధి చేయడమే భారత రాష్ట్ర సమితి అభిమతమని, కార్యకర్తలే పార్టీకి బలమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం వద్ద 7, 25, 26, 48, 49 డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తలతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ పుడితే భారం అనుకున్న వారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల పెండ్లి చేసి ఘనంగా అత్తారింటికి పంపుతున్నట్లు తెలిపారు.
తన కానుకగా వధూవరులకు కొత్త బట్టలు ఇస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తూ సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారని చెప్పారు. గడిచిన ఎనిమిదేండ్లలో నిజామాబాద్ చాలా అభివృద్ధి చెందిందని వివరించారు. 25 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియన్లు నిర్మించామని, హైదరాబాద్ రోడ్డు మాదిరిగానే వర్ని రోడ్, ఆర్మూర్ రోడ్, బోధన్ రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరందిస్తున్నట్లు తెలిపారు. రూ.25లక్షలతో కోటగల్లీలో మార్కండేయ మందిరాన్ని నిర్మిస్తున్నామని, హమాల్‌వాడీ సాయిబాబా సంతోషీమాత ఆలయం పునర్నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీనిచ్చారు.
సుందరీకరణలో నంబర్ వన్..
దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ నగరాన్ని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సుందరీకరించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌తో యువతకు ఉద్యోగాలు రానున్నాయని, దీనికోసం ఎమ్మెల్యే చాలా కష్టపడ్డారని వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, 7వ డివిజన్ ఇన్చార్జి కంచర్ల సంతోష్, గాండ్ల లింగం, అనిల్‌రావు, కృష్ణ, 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిగాద ధర్మపురి, కోఆప్షన్ సభ్యులు అంతరెడ్డి లతాదేవి, డివిజన్ ఇన్చార్జి చింతకాయల రాజు, సిరాజ్పాషా, 26వ డివిజన్ ఇన్చార్జి సిర్ప సువర్ణారాజు,48వ డివిజన్ ఇన్చార్జి సామల ప్రసన్న, సత్యపాల్, రేసు హన్మాండ్లు, 49వ డివిజన్ ఇన్చార్జి అంకర్ మహేశ్, మాజీ కార్పొరేటర్ ఉండ్రా చంద్రభూషణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.