ఖలీల్‌వాడీ, ఏప్రిల్ 5: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలే భారత రాష్ట్ర సమితికి బలం, బలగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పునాదులని చెప్పారు. నగరంలోని వర్ని రోడ్ వద్ద జనార్దన్ గార్డెన్స్‌లో 8,9, 27, 28, 50వ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ నీళ్ల కోసం, నిధుల కోసం కరెంట్ కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నం పెడుతున్నదని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచిందని, ఆడబిడ్డల పెండ్లి బాధ్యతని సీఎం కేసీఆర్ స్వీకరించారని తెలిపారు. రెండసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి బాధ్యత పెంచిన ప్రజలకు కరోనా సమయంలో రెండుసార్లు ఉచితంగా భోజన వితరణ చేశానని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు, వధూవరులకు కొత్త బట్టలు కానుకగా ఇచ్చానన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, బీడీ కార్మికులకు పింఛన్లను అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా నిలుస్తున్నారని అన్నారు. పిల్లలకు మంచి విద్యనందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర అభివృద్ధిలో భాగంగా నూతన కలెక్టరేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐటీ హబ్, అర్బన్ పార్క్, ఆర్యూబీ, సెంటర్ మీడియన్ లైట్లు, అందమైన చెట్లను ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ నగరాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సు, అభివృద్ధి ఆకాంక్షించే పార్టీ కావాలా, ప్రజల మధ్య కుల, మతాల చిచ్చుపెట్టే పార్టీ కావాలా అని ప్రశ్నించారు. అనంతరం 27వ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే బిగాల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, కార్పొరేటర్లు విక్రమ్‌గౌడ్, సాధు సాయివర్ధన్, కార్పోరేటర్ వెల్డింగ్ నారాయణ, బంటు రాములు, మాజీ కార్పొరేటర్ పుప్పాల లావణ్య, నాయకులు సాధు కర్ణవర్ధన్, దీల్లోడ్ ఆకాశ్, భాజన్న, విజయ, శంభునిగుడి చైర్మన్ మల్కాయి మహేందర్ పాల్గొన్నారు.
చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది..
నిజామాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్ అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200 అయ్యిందని తెలిపారు. ఒక కమెడియన్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తూ తెలంగాణాను బద్నాం చేస్తున్నదని, ప్రజలు గమనించాలన్నారు. దేశంలోని అన్నిరాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని తెలిపారు.