ఖలీల్‌వాడి, ఏప్రిల్ 9: ప్రజా సంక్షేమమే భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ ధ్యేయమని, బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ రోడ్లో 15,35,36,43వ డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, కార్యకర్తలే నా బలమని చెప్పారు.
నగర అభివృద్ధిలో భాగంగా నూతన కలెక్టరేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐటీ హబ్, అర్బన్ పార్క్, ఆర్యూబీ, సెంటర్ మీడియన్ లైట్లు, అందమైన చెట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ నగరాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్‌లో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఆర్యూబీ పనులు పూర్తి చేయడంతో డివిజన్వాసులకు కష్టాలు తప్పాయని చెప్పారు. హమాల్‌వాడీ సాయిబాబా, సంతోషీమాత ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మార్కండేయ మందిరానికి రూ. 25లక్షలు, విఠలేశ్వర ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ కావాలా, ప్రజల మధ్య కుల, మతాల చిచ్చుపెట్టే పార్టీ కావాలా అని ప్రశ్నించారు.
60 ఏండ్లలో జరగని అభివృద్ధి, ఎనిమిదేండ్లలో చేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, 15వ డివిజన్ కార్పొరేటర్ ముచ్కూర్ లావణ్యానవీన్, 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మాధురీమురళి, 36వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ ధాత్రిక రేవతీపరమేశ్వర్ , 43వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఎర్రం, కోవూరి జగన్, మాదాని శ్రీధర్, మంకాలి విజయ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.