డిచ్పల్లి, మే 30: ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని నారాయణ కల్యాణమండపంలో మంగళవారం మండలస్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ తపన అని, చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే మూడోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. ఉదయం లేస్తేనే సీఎం కుర్చీ కోసం పోరాడే ప్రతిపక్ష పార్టీల పాలన ఎలా ఉందో గతంలో ప్రజలు చూశారని గుర్తుచేశారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1101 రెసిడెన్షియల్ పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచిత నాణ్యమైన విద్యను చదువుతున్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో 70 దేవాలయాలు కట్టించి ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ చొరవతో రూరల్ నియోజకవర్గానికి 750 కేవీ సబ్‌స్టేషన్ వచ్చిందన్నారు. కరెంటు విషయంలో రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రజల బాగు కోసం సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీగౌడ్ మాట్లాడుతూ జక్రాన్‌పల్లి మండలానికి మిషన్‌భగీరథ, పడకల్‌కు బ్రిడ్జి, అంతర్గత రోడ్లు, బీటీ రోడ్లు, డబుల్ రోడ్లుకు కోట్లాది రూపాయల నిధులు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మంజూరు చేయించిన ఘనత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్దేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ కుంచాల విమలారాజు, జడ్పీటీసీ సభ్యురాలు తనుజా శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ దీకొండ శ్రీనివాస్, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బర్త్‌డే కేక్‌ను కట్ చేయించి తినిపించారు.