ధర్పల్లి, జూన్ 15: బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు రాష్ర్టాభివృద్ధి పట్టదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు. అలాంటి గొప్పవ్యక్తిని విమర్శించే పనికిమాలిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. గురువారం ఆయన ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం ఒకేచోట ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం పల్లె ప్రకృతివనంలో స్థానిక సర్పంచ్ ఆర్మూర్పెద్దబాల్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో బాజిరెడ్డి మాట్లాడారు.
అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు చూరగొనాల్సిన బీజేపీ నేతలు.. మత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మనమే నిజమైన రాముని వంశమని, వారు రావణుడి వంశమని అన్నారు. రాంరాం జప్నా.. పరాయి మాల్ అప్నా అన్న చందంగా బీజేపీ నాయకుల పనితీరు ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలియదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పనికిమాలిన వ్యక్తి అని విమర్శించారు. ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. జిల్లా ఎంపీ అర్వింద్ అభివృద్ధి చేసేది లేక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాధవ్‌నగర్ ఆర్వోబీ పనులకు 63 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే .. 33 శాతమే కేంద్రం అందిస్తుందని తెలిపారు. పసుపు బోర్డు తేలేనివారు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పుష్కలంగా నిధులు మంజూరు చేయిస్తూ ఎక్కడ లేనటువంటి విధంగా నియోజక అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే అన్నారు. రూ.145 కోట్లతో దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడాలేనివిధంగా రూరల్ నియోజకవర్గంలో లక్షా 20 వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారని చెప్పారు.
చెయ్యి గుంజే వరకు చెక్కులందిస్తాం..
మండలంలోని పలు గ్రామాలకు చెందిన కుల సంఘాలకు నిధులు మంజూరుకాగా..ఇందుకు సంబంధించిన చెక్కులను బాజిరెడ్డి అందజేశారు. అనంతరం పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను చెయ్యిగుంజే వరకు అందిస్తామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యేను కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు.
ధర్పల్లిపై వరాల జల్లు
ధర్పల్లిలో 100 పడకల దవాఖానతోపాటు తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. ధర్పల్లి డిగ్రీ కళాశాల సమీపంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. రామడ్గు ప్రాజెక్టులో, ధర్పల్లి పెద్ద చెరువులో పవార్ బోర్డులు ఏర్పాటు చేసి తద్వారా యువతకు సైతం ఉపాధి కల్పిస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మజీద్, నాయకులు మనోహర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జీయర్ కిశోర్‌రెడ్డి, సుభాష్, సురేందర్‌గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, డీఎల్పీ వో నాగరాజు, ఎంపీవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.