Nizamabad | వినాయక్ నగర్, సెప్టెంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం దశాబ్ధ కాలాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సైతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర రతాన్ని జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. అదే సమయంలో అక్కడికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన అనుచరులతో చేరుకున్నారు.
కొద్దిసేపటికి పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి రథయాత్ర ప్రారంభించే దుబ్బ ప్రాంతానికి విచ్చేశారు. అయితే అర్బన్ ఎమ్మెల్యేకు కొబ్బరికాయ కొట్టి జండా ఊపాల్సిందిగా సార్వజనిక్ గణేష్ మండలి బాధ్యులు తెలిపారు. దీంతో ఆయన కొబ్బరికాయ కొట్టే సమయంలో రథయాత్రను ప్రారంభించే జెండా మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఎమ్మెల్యే చేతుల్లోంచి లాగేసుకొని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చేతికి అందించారు. దీంతో ఆయన జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని గమనించిన అర్బన్ ఎమ్మెల్యే వర్గీయులు కాంగ్రెస్ నాయకులు రథయాత్రను ఎలా ప్రారంభిస్తారని, వారు ఏ హోదాలో రథయాత్రను ప్రారంభించారని ఎమ్మెల్యే వర్గీయులు వాగ్వాదానికి దిగారు.
దీంతో సార్వజనిక్ గణేష్ మండలి బాధ్యులు, సభ్యులు అర్బన్ ఎమ్మెల్యే అనుచర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోకుండా తిరగబడ్డారు. వారిని గమనించిన కాంగ్రెస్ వర్గీయులు ఎమ్మెల్యే అనుచర్ల తో తీవ్రస్థాయిలో వాగ్వివాదానాకి దిగారు. అంతేకాకుండా ఒకరినొకరు తోసుకునేందుకు ఒకరు పైకి ఒకరు వచ్చారు. ఈ ఘటనతో రథయాత్ర వద్ద పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసే ప్రమాదపు స్థాయికి చేరింది. గమనించిన పోలీసు అధికారులు, సిబ్బంది వెంటనే ఇరు వర్గాలను నెట్టివేశారు. దీంతోవ కొంత సమయం పాటు ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది.
పోలీస్ అధికారులు తోపులాటకు దిగిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపిచేశారు. రథయాత్రను జెండా ఊపి ప్రారంభించాల్సి వస్తే సార్వజని గణేష్ మండలి బాధ్యులు ప్రారంభించాలని లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యే కు ఆ బాధ్యతలు అప్పగించాలని అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు రథయాత్రను ఎలా ప్రారంభిస్తారని అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు గట్టిగా నిలదీశారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం రథయాత్ర అక్కడి నుండి ముందుకు సాగింది.