వేల్పూర్/భీమ్‌గల్/ మోర్తాడ్/కమ్మర్పల్లి, జూలై 27: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో గురువారం పోలీసు వాహనంలో పర్యటించారు. వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వర్షంలోనే పర్యటిస్తూ.. సమస్యలను తెలుసుకొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో జాతీయరహదారిపై కోతకు గురైన కల్వర్టును పరిశీలించారు. అనంతరం భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, మొగిలి చెరువు కట్టతెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నూతన బస్టాండ్‌లో వరదలో నడుస్తూ సమస్యలను తెలుసుకొన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, అవసరమైన చోట నిర్మాణాలను పరిశీలించి నివేదికను తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట భీమ్‌గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, ఎంపీపీ మహేశ్, వైస్ చైర్మన్ భగత్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, సతీశ్, నర్సయ్య అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మోర్తాడ్‌లో..
మోర్తాడ్ తక్కూరివాడ ప్రాంతంలో వరద ఉధృతి కారణంగా మోర్తాడ్-సుంకెట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతమంతా వర్షపు నీరు నిలిచిపోవడంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఎక్కడి నుంచి వరద వస్తున్నదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్ బోగ ధరణి తదితరులు ఉన్నారు.
కమ్మర్‌పల్లిలో..
కమ్మర్పల్లి మండలంలో వర్షాలతో వరద నిలిచిన ప్రాంతాలను మంత్రి వేముల గురువారం మధ్యా హ్నం పరిశీలించారు. కస్తూర్బా విద్యాలయం చుట్టూ వర్షపు నీరు చేరడంతో విద్యార్థినులను మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బషీరాబాద్, కోనాసముందర్‌లో వరద ప్రాంతాలను పరిశీలించారు. కమ్మర్‌పల్లిలో పద్మశాలీ కల్యాణ మండపం చుట్టూ వర్షపు నీరు చేరడంతో అందులోకి ఎవరూ వెళ్లకుండా చూడాలని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చింత గణేశ్‌కు ఫోన్‌ద్వారా సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. పోలీసు బస్సులో ప్రయాణిస్తూ ప్రజల ఇబ్బందులను తెలుసుకొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితుల పర్యవేక్షణ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని, కానీ నష్టాన్ని నివారించవచ్చంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులను చక్క దిద్దుతున్నారు. ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు మంత్రి వేములతో మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు, రైతులతో మాట్లాడుతూ మేమున్నాం..అంటూ వారికి ధైర్యం చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.