వేల్పూర్, డిసెంబర్ 23 : బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి వేల్పూర్‌లోని తన నివాసంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు మంజూరైన పనులు, పూర్తయిన రోడ్లు, పురోగతిలో ఉన్న రోడ్లు, పనుల మొదలు కోసం శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్న రోడ్ల వివరాలపై ఆరా తీశారు.
రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇటీవల వరదలకు డ్యామేజ్ అయిన రోడ్లు, పిరియాడికల్ రెన్యువల్ (పీఆర్) రోడ్ల పనులను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మోర్తాడ్, బడాభీమ్‌గల్‌లో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు పూర్తయినందున త్వరగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. పనులు కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి పైరవీలు జరగకుండా అర్హులకే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, నియోజకవర్గ 2 బీహెచ్‌కే ఇన్చార్జి అధికారి, డీసీవో సింహాచలం, ఆర్అండ్బీ ఏఈ నర్సయ్య, పంచాయత్ రాజ్ డీఈలు మహేందర్‌రెడ్డి, రాజేశ్వర్, తహసీల్దార్లు రాజేందర్, బావయ్య, శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనిల్, ఎన్పీడీసీఎల్ డీఈ హరిచంద్ తదితరులు పాల్గొన్నారు.