ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 25: ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగుబంధం ఉన్నదని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ అనుబంధాన్ని దూరం చేయలేరని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ మైదానంలో టీఎన్జీవో 34వ స్థాయి అంతర్ శాఖల క్రీడా పోటీలు, వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి వేముల హాజరై మాట్లాడారు. క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు వేరు, తాము వేరు అనే భావన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే దానితో రాష్ర్టానికి మేలు జరుగుతుందని బలంగా విశ్వసించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. అందుకే ఉద్యోగులు అడుగకముందే వారికి జీతాలు, ఉద్యోగోన్నతులు, వైద్య సదుపాయాలు వంటి విషయంలో అనుకూల నిర్ణయాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల కింద రూ. 57 వేల కోట్లు వెచ్చిస్తే .. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి 2022 వరకు రూ.మూడు లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా27వేలు ఉండగా ప్రస్తుతం 2.77లక్షలకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలనే సంకల్పతోనే బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ కల్యాణ మండప స్థలానికి అనుమతులు మంజూరు చేసి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేములను టీఎన్జీవోస్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర మేయర్ దండు నీతూ కిరణ్ , ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ల రాజేందర్, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్, జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.