కామారెడ్డి/కంఠేశ్వర్, నవంబర్ 2: జిల్లాల్లో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కలెక్టర్లతో శనివారం సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైందని తెలిపారు. ధాన్యం కేటాయింపు ప్రక్రియ కూడా కొనసాగుతున్నదని, 90 మిల్లులు అండర్ టేకింగ్ ఇచ్చాయని చెప్పగా, మంత్రి కలెక్టర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇదే తరహా చొరవ చూపుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు కొనుగోళ్లు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు. అవసరమైన గోదాంలను గుర్తించామన్నారు. సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిందని, సన్నరకం కొనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు రకం ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
తాలు, తప్ప పేరుతో కోతలు విధించొద్దని, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే కాంటా చేయాలని సూచించారు. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాకే మిల్లర్లకు ధాన్యం కేటాయించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, విక్టర్, సబ్‌కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్, రెవెన్యూ, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.