భీమ్గల్, జనవరి 21: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్నా.. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిల్లి గవ్వ నిధులను కూడా విడుదల చేయలేదు. పట్టణంలో ఎలాంటి ప్రజోపయోగ పనులను కూడా చేపట్టలేదు. కానీ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క బుధవారం భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ, అమృత్ 2.0 నిధులతో చేపట్టే పలు పనులకు అకస్మాత్తుగా శంకుస్థాపనలు చేశారు. నేడో, రేపో మున్సిపల్ ఎన్నికలు ఉండగా మంత్రితో శంకుస్థాపనలు చేయించడం కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమేనన్న విషయం తేటతెల్లమవుతున్నది.
రెండేండ్లుగా పట్టణంలో పాలన ఎక్కడ వేపిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నా.. పారిశుద్ధ్యం పడకేసి, పట్టణం దుర్గంధంగా మారినా పట్టించుకోని నాయకులు ఎన్నికల వేళ హడావుడిగా మంత్రిని పిలిపించి హంగామా చేయడం వెనుక ఎన్నికల ప్రయోజనం తప్ప మరొకటి లేదన్న విషయం ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలుస్తున్నది. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు వేగంగా సాగుతుండగా.. ఎలాంటి ప్రణాళికా లేకుండా మంత్రి అకస్మాత్తు పర్యటన రాజకీయ ఎత్తుగడలో భాగమేనన్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. కొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వ్యూహాత్మంగా మంత్రిని తీసుకువచ్చి శంకుస్థాపనలు చేయించడం కేవలం ఓట్లు రాబట్టుకోవాలనే కాంక్ష తప్ప మరోటి కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎన్నికలకు నెలల ముందు శంకుస్థాన చేయగా.. రాజకీయం చేయడంతోపాటు రాద్దాంతం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇలా వ్యవహరించడం నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు ఉన్నది.
పాత నిధులతో కొత్త పూత..
ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పట్టణ అభివృద్ధికి విడుతల వారీగా అనేక నిధులు మంజూరు చేయించారు. వీటితో పట్టణంలో డబుల్ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మధ్యలో గార్డెనింగ్ తదితర పనులు చేపట్టారు. పట్టణంలోని అన్ని వార్డులు, కాలనీల్లో సీసీ, బీటీ రోడ్లు, డివైడర్లు నిర్మించారు. పట్టణ పరిధిలోకి వచ్చే లింబాద్రి గుట్టపై రూ.కోట్లతో డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయించారు.
పట్టణ శివారులో వంద పడకల దవాఖాన, సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేయగా దాని నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు ఆగి పోయాయి. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పలు అభివృద్ధి పనులు చేయడానికి అప్పట్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిధులు సైతం మంజూరు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ నిధులు విడుదల చేయకుండా.. పేరు మార్చి మళ్లీ కొత్తగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ వాస్తవానికి అవి అప్పడు మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించిన నిధులు మాత్రమే. పాత నిధులతో కొత్త పూత పూసి, ఇప్పుడు హడావుడిగా శంకుస్థానలు చేయడంతో పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.