రైతులతో వరి వేయించిన బండి సంజయ్ వడ్లకొనుగోలు టైముకు ఎక్కడికిపోయిండు?పీయూష్ గోయల్ నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజల్ని అవహేళన చేసిండు రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు ఒక్కొక్కరిది ఒక్కో మోసం..రైతులు గోస పడొద్దనే వడ్ల కొనుగోలుకు కేసీఆర్ నిర్ణయం పీసీసీ అధ్యక్షుడు పిచ్చికుక్కలా మాట్లాడుతున్నడు..విపక్ష నేతల తీరుపై విరుచుకుపడిన మంత్రి వేముల
ఖలీల్‌వాడి/విద్యానగర్, ఏప్రిల్ 13: యాసంగిలో వరి సాగు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వంతో ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టినోళ్లు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారంటూ బీజేపీ నాయకులు, ఎంపీలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కొర్రీలను ముందునుంచే గ్రహిస్తున్న సీఎం కేసీఆర్.. రైతులను ఇతర పంటలవైపు మళ్లించి అప్రమత్తం చేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సూచనలను పట్టించుకోవద్దని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికి వెళ్లిపోయాడో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న సమయంలో రైతులకు కేసీఆర్ అండగా నిలిచి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించారని అన్నారు. ధాన్యం సేకరణపై ఉభయ జిల్లాల అధికార యంత్రాంగంతో బుధవారం వేర్వేరుగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంత్రి క్షీరాభిషేకం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వడ్లు కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైతులను నమ్మించారని, పంట చేతికివచ్చే సమయంలో మరో మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినండంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేశారని గుర్తుచేశారు. కేంద్రానికి రైతుల బాధను తెలియజేసేలా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా తీర్మానాలు, నిరసన దీక్షలు చేసినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ దీక్ష చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. రైతులను రెచ్చగొట్టిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇప్పుడు పంట కోతకు రాగానే పత్తాలేకుండా పోయారని మండిపడ్డారు.
అన్నదాతకు అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతోపాటు ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. రైతుబాంధవుడని కొనియాడారు. ఎవరు మోసగాళ్లో, ఎవరు రైతు పక్షపాతో రైతులు గ్రహించాలని కోరారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, అలీం, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.