నిజామాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కొన్నాళ్లుగా స్తబ్దత నెలకొన్నది. మంత్రివర్గ కూర్పుపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేకపోవడంతో త్వరలో చేపట్టనున్న ‘విస్తరణ’లో ఒకరికి చోటు దక్కనున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కేటాయించబోయే అమాత్యుడి పోటీలో పాత, కొత్త ఎమ్మెల్యేలు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇందులో సీనియర్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డికి గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఎనిమిది దశాబ్దాల వయసులో ఇవే చివరి ఎన్నికలంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకే మంత్రి పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అధిష్టానం కూడా తనవైపే మొగ్గు చూపుతుందని భావిస్తుండగా.. మంత్రివర్గ విస్తరణపై సందిగ్ధత నెలకొన్నది.
దీనిపై ఆ పార్టీ సీనియర్ నాయకులను ప్రశ్నిస్తే అంతా గందరగోళం, అయోమయం నెలకొన్నదని బదులివ్వడం గమనార్హం. మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేకు అవకాశం దక్కడం ఖాయం కావడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ అన్నట్లుగా రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇవే తనకు చివరి ఎన్నికలంటూ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. క్యాడర్ కోరిక, ప్రజల విన్నపాల మేరకు బరిలో నిలిచి కేవలం మూడున్నర వేల ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్రెడ్డికే మంత్రి పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు.
డిసెంబర్ 7న కొలువుదీరిన రేవంత్ రెడ్డి టీమ్‌లో ఉమ్మడి జిల్లాకే చోటు దక్కలేదు. తొమ్మిది నెలలవుతున్నా మంత్రి వర్గ కూర్పు జరగడం లేదు. సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ కూర్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆ యోగం ఎవరికి వరిస్తుందో? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంధుత్వం కూడా ఉండడంతోపాటు ఆది నుంచి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మద్దతు ఇచ్చిన వారిలో సుదర్శన్ రెడ్డి కూడా ఒకరు.
కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు, ప్రజా జీవితంలో అనుభవం దృష్ట్యా మంత్రి పదవి తనదేనన్న పట్టుదలతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. హోం మంత్రిగా కీలక శాఖను కూడా సుదర్శన్రెడ్డికే కేటాయించే అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన షబ్బీర్ అలీకి సలహాదారు పోస్టుతో సరిపెట్టగా.. సుదర్శన్ రెడ్డికి అంతగా పోటీ లేకుండా పోయింది. కానీ జూనియర్ ఎమ్మెల్యే ధాటిని తట్టుకుని నిలబడగలడా? అన్నది తేలాల్సి ఉన్నది
వైద్య రంగం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ఎమ్మెల్సీగా అనుభవం ఉన్నది. దీంతో ఆయన తనకే మంత్రి పదవి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుంచి గెలిచిన లక్ష్మీకాంతారావు సైతం తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ దళిత సామాజిక వర్గం కోటాలో పదవి ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలం నుంచి దళిత సామాజిక వర్గానికి పదవులే లేకపోవడంతో ఈ అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చి,
మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు సైతం ఏఐసీసీ ద్వారా మంత్రి పదవి కోసం జోరుగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ ఐటీ వింగ్‌కు సేవలు అందించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పెద్దలతోనే నేరుగా సంప్రదింపులు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా డాక్టర్ భూపతి రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ మంత్రి పదవి కోసం బరిలో ఉండడంతో మంత్రివర్గ విస్తరణలో జాప్యం నెలకొన్నట్లు పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.