కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధుల వరద పారించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి రూ.90 కోట్లు ప్రకటించారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రామన్న.. రూ.55 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. మంత్రి వేముల, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ పాల్గొన్నారు.
నిజామాబాద్, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / (కామారెడ్డి, నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రా మారావు కామారెడ్డి జిల్లా పర్యటన సక్సెస్ అ య్యింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఐటీ మంత్రికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఎల్లారెడ్డి శివారులో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.జనం స్పందనను చూసి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. కామారెడ్డికి రూ.45కోట్లు, ఎల్లారెడ్డి రూ.45కోట్లు చొప్పున నిధులు మంజూరు చేశారు. ఎల్లారెడ్డి బహిరంగ సభా వేదికపైనే రూ.45కోట్ల నిధుల మంజూరుకు సంబంధించిన జీవో కాపీలను ఎమ్మెల్యే సురేందర్‌కు కేటీఆర్ అందించారు. కేటీఆర్ పర్యటన విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. సభా వేదికపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను 70వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు…
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన మొ దట కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాగత తోరణా న్ని,ఆరు వరుసల రహదారులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కలియ తిరిగారు. తాడ్వాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి, బీటీ రోడ్లు, చిల్డ్రన్ పార్కులను ప్రారంభించి ఆర్టీసీ బస్టాండ్, సమీకృత మార్కెట్, మున్సిపల్ కొత్త భవనాలకు భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి శివారులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి స్వగృహంలో భోజనం చేసి సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు.
కాల్చుకు తిన్నది కాంగ్రెస్ కాదా?
తెలంగాణ రాక ముందు ఒకప్పటి కరెంట్‌కు ఇప్పు డు అందుతున్న విద్యుత్ సరఫరాకు తేడాను కేటీఆర్ వివరించారు. గతంలో ఎవరైనా ఊర్లలో చనిపోతే అంత్యక్రియలు అయినంక స్నానాలకు 20 నిమిషాలు కరెంట్ కోసం దండం పెట్టిన కాలం మరిచినమా అంటూ ప్రజలకు గత చేదు అనుభవాలను గుర్తు చేశారు. రేవంత్ రెడ్డే అసెంబ్లీలో తన నాయిన చనిపోతే స్నానాలు చేసేందుకు కరెంట్ కోసం కరెంటోళ్లను బతిమిలాడుకున్నానని అసెంబ్లీలోనే చెప్పిండు కదా? అంటూ వివరించారు. 2001 నుంచి 2004 వరకు కేసీఆర్‌కు తమ్ముడిలా పని చేసి, ఎక్కడికి వెళ్లినా వెన్నంటి ఉంటూ ఉద్యమ వీరుడిగా నిలిచిన వ్యక్తి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అని మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు. 2001లో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12 మండలాల్లో 10 మండలాలు ఊడ్చేసిన ఘనమైన చరిత్ర ఈ గడ్డకు ఉన్నదని గుర్తు చేశారు. తాడ్వాయిలో 12వేల మెజార్టీతో జడ్పీటీసీని గెలిపించుకున్నామంటే గర్వంగా ఉందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు బీటీ రోడ్ల నిర్మాణాలకు జాజాల సురేందర్ విన్నవించగా కేటీఆర్ స్పందించి నిధులను మంజూరు చేస్తున్నట్లుగా చెప్పారు. నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. మొత్తం రూ.45కోట్లు అందించారు.
అవే పాచిపోయిన మొఖాలు…
50 ఏండ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ మాటలను ఇంకా నమ్మొద్దని కేటీఆర్ చెప్పారు. వీరంతా కొ త్తోళ్లా. గదే షబ్బీర్ అలీ గదే పాచిపోయిన ముఖా లు కావా? అన్నారు. షబ్బీర్ అలీ ఇప్పుడు గడపగడపకూ కాంగ్రెస్ అంటూ తిరుగుతున్నడు ఇదం తా ఏం పీకతందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డికి జిల్లాను ఇచ్చింది. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.73వేల కోట్లు రైతుబంధు అందిస్తే అందులో లక్షా 3వేల మందికి రైతుబంధు ఎల్లారెడ్డిలోనే వస్తుందన్నారు. రైతుబీమా ద్వారా 2,043 మంది ప్రయోజనం దక్కిందన్నారు. కల్యాణలక్ష్మి 6636 మందికి, 557 మందికి షాదీముబారక్ అందించామన్నారు. గొల్ల కుర్మలకు 5161 యూ నిట్లు ఇవ్వగా… రెండో విడుత మొదలవుతున్నదన్నారు. ఎల్లారెడ్డిలో 4.67కోట్ల చేప పిల్లలు 400 చెరువుల్లో వదిలినట్లు వివరించారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేసింది చెప్పుకునే దమ్ముందా. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ ఏం చేసినవో చెప్పి ఓట్లడగాలి అంటూ సవాల్ విసిరారు. నన్ను అడిగితే ప్రతి ఒక్క రంగానికి ఇచ్చింది చెబుతామన్నా రు. ఎన్నికలు వస్తుండడంతో గంగిరెద్దుల్లా కాంగ్రెసోళ్లు వస్తున్నారని మండిపడ్డారు. మీకు ఏదంటే అదీ ఫ్రీ అంటారని, అవసరమైతే 25గంటల కరెంట్ అని కూడా చెబుతారని ఎద్దేవా చేశారు. దినంలో లేని గంటను కూడా చేర్చుతారని అన్నారు.
బీజేపీ మోసకారి…
2014లో జన్ ధన్ ఖాతా కోలో.. ధన్ ధన్ పంద్రా లాక్ దేతూ అంటూ ప్రధాని మోదీయే పెద్ద పెద్ద మాటలు నరికిండని కేటీఆర్ అన్నారు. తొమ్మిదేండ్లు అవుతున్నప్పటికీ ఒక్క పైసా మన ఖాతాలో పడలేదన్నారు. కానీ గుండు కొట్టిండని చెప్పారు. మన్మోహన్ సింగ్ సిలిండర్ ధర రూ.400 చేస్తే తిట్టిండు. దద్దమ్మ అన్నడు. ఆడబిడ్డలంతా సిలిండర్‌కు దండం పెట్టి ఓటెయ్యమన్నడు. రూ.400లు చేస్తేనే నాలుగు వందల తిట్లు తిట్టిన మోదీనే ఇప్పుడు అదే సిలిండర్ ధరను రూ.1200 చేసినందుకు ఎన్ని తిట్టాలి అంటూ ప్రశ్నించారు. బీజేపీకి పిండం పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను పెంచి పిరమైన ప్రధానిగా మారిన మోదీకి మనం తప్పకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఎల్లారెడ్డిలో డిపాజిట్ గల్లంతు కావాలన్నారు. మనకు ఉన్నది ఒక్కటే రామబాణం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆరే అని తెలిపారు.