నిజామాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆరే స్వయంగా పోటీ చేస్తామంటే తామంతా మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకుంటామంటూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీర్మానాలు సైతం చేశారు.ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ మెజార్టీ మాత్రం భారీగా రావాలనే సంకల్పంతో బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గం నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ ప్రస్తుతం మండలాల వారీగా ప్రభుత్వ విప్, స్థానిక ఎ మ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు పాత మాచారెడ్డి, పాత కా మారెడ్డి మండలాల్లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరో ఇన్‌చార్జీగా నియమించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సైతం నిత్యం కామారెడ్డిలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారపర్వాన్ని ఉధృతంగా నిర్వహించేందుకు సమన్వయ కమిటీని సైతం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు నిట్టు వేణుగోపాల్, పున్నా రాజేశ్వర్, ఎల్. నర్సింగరావుతో సమన్వయ కమిటీ ఏర్పడింది. ఈ స మన్వయ కమిటీ ఆధ్వర్యంలోనే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సమన్వయ కమిటీ నిత్యం సంప్రదింపులు జరుపుకుంటూ ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలతో పా టు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో సమన్వయ కమిటీ మండలాల వారీగా అన్ని వర్గాల నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు కదులుతున్నది.
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతా కార్యకర్తల బలం భారత రాష్ట్ర సమితి సొంతం. కామారెడ్డి నియోజకవర్గంలోనూ దాదాపు 5లక్షలకు పైగా సభ్యులతో బీఆర్ఎస్ పార్టీ సైన్యం అందుబాటులో ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కనీసం సభ్యత్వాలకు ముందుకు రాని దుస్థితి ఏర్పడడంతో వారి పార్టీలో కార్యకర్తలే లేకపోవడంతో వెలవెలబోతున్నది. ఈ పరిస్థితుల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌కు భారీ మెజార్టీ లక్ష్య సాధనలో భాగంగా పార్టీ శ్రేణులతో ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రజల అవసరాలు, అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చే ప్రభుత్వంలో వాటిని నెరవేర్చేందుకు హామీలు సైతం ఇస్తున్నారు. కేసీఆరే స్వయంగా వచ్చి పోటీ చేస్తున్న నియోజకవర్గానికి అభివృద్ధి పనుల విషయంలో, మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద పీట దక్కుతుందన్న విషయాన్ని శ్రేణులంతా ప్రజలకు వివరిస్తున్నారు. భారీ మెజార్టీ కోసమై కేటీఆర్ నేరుగా శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశనం చేస్తున్నా రు. మంగళవారం పాత మాచారెడ్డి మండలం పరిధిలో సమావేశం జరుగనున్నది. కేటీఆర్ హాజరై కార్యకర్తలతో మాట్లాడనున్నారు. తదనంతరం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్ మైదానంలో కామారెడ్డి పాత మండలం ప్రాతిపాదికన సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులోనూ కేటీఆర్ పాల్గొని గులాబీ శ్రేణులను ఉత్తేజపర్చనున్నారు. బుధవారం పాత భిక్కనూర్, పాత దోమకొండ మండలాల వారీగా సమావేశాలు జరుగనున్నాయి. భిక్కనూర్‌లో ఏర్పాట్లను సోమ వారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు.