ఖలీల్‌వాడి, ఆగస్టు 9: రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగరంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో ఉదయం 11.45గంటలకు నూతన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెలికాప్టర్లో రాగా, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, మహ్మద్ షకీల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మేయర్ దండు నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ టవర్లోని ఒక్కో చాంబర్‌ను మంత్రి వేముల, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఇటీవల జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన యువతతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం న్యాక్ బిల్డింగ్‌ను ప్రారంభించి పరిశీలించారు. దుబ్బ ప్రాంతంలో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి.. ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మేయర్ సీటులో నీతూకిరణ్ను కూర్చోబెట్టారు.

వర్ని రోడ్డులో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి రఘునాథ చెరువు(మినీ ట్యాంక్‌బండ్)ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఎలక్ట్రిక్ బగ్గీలో ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించారు. అనంతరం అర్సపల్లిలో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి శ్రీరామ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. పాలిటెక్నిక్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు కొత్తగా నిర్మించిన పాలిటెక్నిక్ బ్లాక్‌ను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన భారీబహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది. అభివృద్ధి పనులు ప్రారంభించే ప్రతిచోటా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. పలుచోట్ల ప్రజల నుంచి మంత్రి కేటీఆర్ వినతులు స్వీకరిస్తూ, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగడం విశేషం.