కామారెడ్డి, జూలై 13 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తుల రూ. లక్ష ఆర్థిక సహాయం ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. కులవృత్తులు, చేతివృత్తులు చేసుకొనే వారికి ప్రోత్సాహం అందిస్తే ఎదుగుతారనే ఉద్దేశంతో రూ.లక్ష గ్రాంట్ అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఈ పథకాన్ని జూన్ 9న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 300 మందికి లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేయాలని సూచించారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50 మంది లబ్ధిదారులకే వర్తిస్తుందని, కొన్ని వర్గాల వారికి మాత్రమే ఇస్తున్నారని అసంపూర్తి వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఇవి ఏ మాత్రం వాస్తవం కాదని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారందరికీ దశల వారీగా పథకం అమలవుతుందని, ప్రతి నెలా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 15న చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ సహాయం అందుకున్న లబ్ధిదారులు వారికి నచ్చిన చోట అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి కులవృత్తి చేసుకోవచ్చని సూచించారు.నెలరోజుల్లోపు అధికారులు సదరు లబ్ధిదారుడి యూనిట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో పకడ్బందీగా అమలు: కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ బీసీ లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. వీసీలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.