ఖలీల్వాడి డిసెంబర్ 15: ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. వేకువజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలితీవ్రత తగ్గడంలేదు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత పెరగడంతో వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసేస్తున్నారు.
చలి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఉన్నిదుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని, ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించాలని సూచిస్తున్నారు.