ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 11: మధ్యాహ్న భోజనం పెట్టక పోవడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఖాళీ కడుపులతో పస్తులున్నారు. మరికొందరు మండుటెండలో హాస్టల్కు వెళ్లి తిని వస్తున్నారు. వారం రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నది. పది రోజుల క్రితం పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు దవాఖాన పాలైన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. వెంటనే కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో స్థానికంగా ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేసే వారిని పిలిపించి మధ్యాహ్న భోజనం పెట్టించారు. రెండ్రోజులు వంట చేసిన తర్వాత వారు రావడం మానేశారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం తిండి లేకుండా పోయింది.
పాఠశాలలో చదువుకుంటున్న ఆయా వసతి గృహాలకు చెందిన విద్యార్థులు హెడ్మాస్టర్ ఆదేశాల మేరకు భోజనం కోసం తమ వసతిగృహాలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వేళ మండుటెండలో ప్రధాన రహదారి మీదుగా నడుచుకుంటూ వెళ్లి తినేసి వస్తున్నారు. మిగతా విద్యార్థులలో కొంతమంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటుండగా, మరికొందరు పస్తులుంటున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం స్పందించక పోవడం గమనార్హం. పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు