కామారెడ్డి, ఏప్రిల్ 14: భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉద యం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఫలితంగా 8 గంటల నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పది తర్వాత నిప్పుల కొలిమి రాజుకుంటున్నది. రెండు, మూడ్రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. మంగళవారం ఏకంగా 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. భిక్కనూరులో అత్యధికంగా 42.9 డిగ్రీలు నమోదు కాగా, నస్రుల్లాబాద్, మద్నూర్, జుక్కల్ మండలాల్లో 42.8, పాల్వంచలో 42.6, మహ్మద్‌నగర్, బిచ్కుందలో 42.1, కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారిలో 42, పిట్లంలో 42.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉక్కపోత
దంచికొడుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోతతో ఉడికి పోతున్నారు. పది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్న వారు తప్ప మిగతా వారు గడప దాటడం లేదు. బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా భగభగలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు గిర్రున తిరుగుతున్నా ఉక్కపోత తగ్గడం లేదు. ఏప్రిల్ రెండో వారంలో ఎండలు దంచి కొడుతుండడంతో రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు.