నిజామాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇటు వ్యాపారుల దోపిడీ పర్వం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్నదాతల శ్రమను దోచుకుంటుండగా, మరోవైపు కాంటాల రూపంలోనూ కర్షకులను ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో ధర్మకాంటాల్లో జరుగుతున్న అక్రమాలు బయటపడుతున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు నిద్దరోతుండడం, తనిఖీల సంగతే మరవడంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. గతంలో పంట కోతకు వస్తున్న తరుణంలోనే యంత్రాంగం అప్రమత్తమయ్యేది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టేది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగేది. రైస్‌మిల్లర్లు, ప్రైవేటు వర్తకులు, లారీల యజమానులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, రవాణా, తూనికలు, కొలతలు, పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఇలా ధాన్యం కొనుగోళ్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో తరచూ సమీక్షలు జరిగేవి. కానీ ఇప్పుడు అంతటి శ్రద్ధ కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ఉభయ జిల్లాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇన్చార్జి మంత్రి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుండా పోయింది. కొత్తకొత్త సమస్యలు వెలుగు చూస్తుండగా, శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
రెండ్రోజుల క్రితం మాచారెడ్డి మండలంలోని ధర్మకాంటలో లోటుపాట్లు వెలుగు చూడడం ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ధాన్యం బరువు విషయంలో రైతులకు అనుమానాలు రావడంతో అక్రమ దందా బయటపడింది. కొత్తపల్లి గ్రామంలో సేకరించిన 741 బస్తాల వడ్లను పాల్వంచలోని ఓ రైస్‌మిల్లుకు చేర్చారు. అక్కడ ధర్మకాంట లేకపోవడంతో చుక్కాపూర్‌లోని ధర్మకాంటపై బరువును కొలిచిన అనంతరం రైస్‌మిల్లుకు తరలించారు. ధర్మకాంట వద్ద తీసిన బరువు చీటితో, కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాల రసీదులను రైతులు పోల్చి చూశారు.
తూకంలో తేడాలు రావడాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తూనికలు, కొలత శాఖ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం వచ్చి తనిఖీలు చేపట్టగా ధర్మకాంటలో తేడాలు బయట పడడంతో రూ.10వేలు జరిమానా విధించారు. అయితే, ఈ వ్యవహారంతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందని రైతులు విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ముందే అన్ని ధర్మకాంటాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గతంలోనూ ఈ తరహా మోసాలు బయట పడ్డాయి. గాంధారి మండలంలోని జువ్వాడిలో, నిజాంసాగర్ మండలం కోమలాంచలోనూ రైస్‌మిల్లుల తూకం యంత్రాల్లో లోపాలు గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టక పోవడం గమనార్హం.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపుగా 400 రైస్‌మిల్లులు సీఎంఆర్‌కు ముందుకొచ్చాయి. ధాన్యం కొనుగోళ్ల అనంతరం కేంద్రాల నుంచి మిల్లులకు చేర్చుతున్నారు. ఈ క్రమంలో తూకాల్లో తేడాలు రైతులను ముంచుతున్నాయి. కొన్నిచోట్ల మిల్లర్లు తప్పులు చేస్తూ దండుకుంటుండగా, మరికొన్ని చోట్ల ధర్మకాంటలో లోపాలు సైతం అన్నదాతలకు శాపంగా మారాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కర్షకుల రెక్కల కష్టం అక్రమార్కుల పరమవుతున్నది. కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖకు ఇన్చార్జి అధికారి పని చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల తనిఖీలు చేపట్టకపోవడంతో పాటుగా పర్యవేక్షణ లోపాల విషయంలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీ డ్రైవర్లు రైతుల నుంచి బస్తాకు రూ.1 చొప్పున దోపిడీ చేస్తున్నారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.