నిజామాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు… సామాన్య కుటుంబాలను కలవరానికి గురి చేస్తున్నాయి. వివిధ దేశాలపై సుంకాల భారం మోపుతూ ఆర్థిక వ్యవస్థతో ఆటాలాడుతున్నట్లే విదేశీయులపై ఆంక్షలు సైతం తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తోంది. మొన్నటి వరకు అమెరికాలో కాలు పెడితే చాలు అనుకునే పరిస్థితి. ఇప్పుడేమో అమ్మో అమెరికా అంటూ బెంబేళెత్తిపోయే దుస్థితి ఏర్పడింది.
గతేడాది జరిగిన అధికార మార్పిడితో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కఠిన నిబంధనలను అమలు చేస్తుండటంతో భారతీయులకు శాపంగా మారింది. విద్యాభ్యాసం కోసం అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని వెళ్లిన వారంతా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్ట్ టైం జాబ్‌ల కోసం వెంపర్లాడుతూ సతమతం అవుతున్నారు. ఇండియా నుంచి డబ్బులు పంపడం తలకు మించిన భారం అవుతుండటం, అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేయడం గగనం అవ్వడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు తలకిందులవుతున్నాయి.
ఎం.ఎస్. పూర్తైన తర్వాత ఎక్కువ కాలం ఉండే అవకాశం లేకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ అవకాశాలకు ఆశలు లేకపోవడంతో అక్కడే ఉండలేక డాలర్ డ్రీమ్‌ను పక్కన పెట్టేసి తిరుగు ముఖం పడుతున్న ఉదంతాలు ఇప్పుడు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న కారణంతో వందలాది మంది భారతీయులను డొనాల్డ్ ట్రంప్ ఇంటికి పంపి వేయగా మిగిలిన వారు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారుగా 15వేల నుంచి 20వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లినట్లుగా పలు కన్సల్టెన్సీ సంస్థల అంచనాలు చెబుతున్నాయి.
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన వారంతా సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించాలంటే జంకుతున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఎక్స్, థ్రెడ్ ఖాతాలపై అమెరికా నిఘా సంస్థలు నిఘా పెట్టాయి. అమెరికా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారందరినీ అక్కడ్నుంచి బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. ఈ చిన్న కామెంట్ పెట్టినా ప్రభుత్వం ఊరుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియా వాడాలంటేనే ఇండియన్స్ వణికి పోతున్నట్లుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా కొంత మంది భారతీయులు ఈ మధ్యే ఆందోళనలు చేశారు. దీంతో ఆగ్రహించిన అక్కడి ప్రభుత్వంగా ఆందోళనలో పాల్గొన్న వారందరినీ గుర్తించింది.
అమెరికా విడిచి వెళ్లాంటూ వారి మెయిల్ ఐడీలకు సందేశాలను పంపడంతో విద్యార్థులంతా కంగుతింటున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారంతా భయం గుప్పిట నలిగి పోతున్న దుస్థితిని గ్రహించి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్వదేశంలో తల్లిఢిల్లుతున్నారు. పరిస్థితులు తలకిందులు అవుతుండటంతో అప్పులకు వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకునే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అష్టకష్టాలు పడి మధ్య తరగతి కుటుంబాల నుంచి అమెరికా వెళ్లిన యువతీ, యువకులైతే పార్ట్ టైం జాబ్‌లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. దొడ్డి దారిలో జాబ్‌లు చేసి ప్రభుత్వానికి చిక్కితే అసలుకే మోసం వస్తుందని భయ పడుతున్నారు. మరోవైపు జాబ్ చేయలేకపోతే బతకడం కష్టమని ఆందోళన చెందుతున్నారు. ఇండియా కరెన్సీ రోజురోజుకు బలహీనం అవుతోంది. అమెరికాకు డాలర్ రూపంలో డబ్బులు పంపడమూ ఈ పరిస్థితిలో కష్టంగానే మారింది.
ఎఫ్1 వీసాపై వెళ్లిన వారిపై అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు ఎప్పటికప్పుడు చట్టాల్లో మార్పులు చేస్తోంది. గ్రీన్ కార్డ్ హోల్డర్లపైనా ఆంక్షలు రుద్దుతోంది. ఈ పరిస్థితిలో శాశ్వత నివాసం అనే ప్రస్తావనకే ముప్పు ఏర్పడింది. అమెరికాలో ఎవరు ఉండేది? ఎవరు బయటకు వచ్చేది? అయోమయంగా మారింది. అమెరికాలో దీర్ఘకాలికంగా ఉండటం కష్టమనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వీసా, ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినం చేసేందుకు సిద్ధం అవుతుండటంతో ఇండియాకు రావడానికి చాలా మంది ఇష్టం చూపడం లేదు. పెళ్లిళ్లు, శుభ కార్యక్రమాలకు అమెరికా నుంచి రావాలనుకునే వారంతా భయపడుతున్నారు.
అమెరికాకు తిరిగి వెళ్లడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఒక వేళా అమెరికా ప్రభుత్వం అనుమతి ఇస్తుందో? లేదో? అన్న ఆందోళనతో చాలా మంది తమ సొంత రక్తసంబంధీకుల పెళ్లిళ్లకు సైతం రాలేక పోతుండటం నిజామాబాద్ నగరంలో ఈ మధ్యే ఓ కుటుంబానికి ఎదురైంది. తమ పిల్లల బంగారు భవిష్యత్తును ఊహించుకుని చాలా మంది తల్లిదండ్రులు అనేక రకాలుగా అవకాశాలను ఉపయోగించుకుని అప్పులు చేసి అమెరికాకు తమ బిడ్డలను పంపించారు. ఈ గడ్డు కాలంలో చేసిన అప్పులు తీరకపోవడంతో తల్లిదండ్రులు మానసికంగా ఇక్కట్లు అనుభవిస్తున్నారు. అప్పులకు వడ్డీలు చెల్లించలేక, బ్యాంక్ రుణాలకు ఈఎంఐలు కట్టలేక తలలు బాదుకుంటున్నారు.