కంఠేశ్వర్, జనవరి 30 : పసుపు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మద్దతు ధర చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మం తు అధికారులకు సూచించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు విక్రయాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పసు పు పంటకు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధర, పంట దిగుబడి, నాణ్యత తదితర వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు క్వింటాలుకు నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర లభిస్తోందని రైతు ప్రతి నిధులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మార్కెట్‌కు పంట దిగుబడి ఎక్కువగా వస్తున్నందున ధర తగ్గే అవకాశం ఉందని, రైతులు నష్టపోకుండా ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతు ఎట్టి పరిస్థితిల్లోనూ నష్టపోరాదని కలెక్టర్ సూచించారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ప్రస్తుతం పసుపు పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్ ఉందని తెలిపారు. పసుపు క్రయవిక్రయాల సీజన్ కొనసాగుతున్నదని, క్రమం తప్పకుండా మార్కెట్ యార్డును సందర్శిస్తూ నేరుగా రైతులతో భేటీకావాలని మార్కెటింగ్, ఉద్యానవన,వ్యవసాయ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఒకే నాణ్యతలో కూడిన పంటలకు ట్రేడర్లు చెల్లించే ధరలో వ్యత్యాసం ఉండకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మార్కెటింగ్ ఏడీ గంగామణి, ఉద్యాన వన శాఖ ఆధికారి నర్సింగ్ దాస్, రైతు సంఘాల ప్రతినిధులు అన్వేష్ రెడ్డి, వి.ప్రభాకర్, దేవరాం పాల్గొన్నారు.