నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్‌గా బర్త్‌డే వేడుకలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వైద్య సిబ్బంది విధులను విస్మరించి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లలో నిమగ్నం కావడం, అదే సమయంలో ఫిట్స్‌తో బాధ పడుతున్న భార్యను భుజాన వేసుకుని వచ్చిన వ్యక్తిని పట్టించుకోక పోవడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. అటు బాధితుడి ఆర్తనాదాలు, ఇటు మేడమ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
-ఖలీల్‌వాడి, జనవరి 11
జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పుట్టినరోజు శనివారం కావడంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించాలని వైద్య సిబ్బంది భావించారు. శుక్రవారం సాయంత్రం నుంచే మేడమ్ చాంబర్లో ఏర్పాట్లలో తలమునకలయ్యారు. విధులు పక్కన పెట్టి ఆ గదిని ఫంక్షన్‌హాల్‌గా తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన బిద్యానాయక్ భార్యకు ఫిట్స్ రావడంతో శుక్రవారం రాత్రి హుటాహుటిన జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.
గేట్ వద్ద ఎవరూ లేకపోవడంతో భార్యను భుజాన వేసుకుని బిద్యానాయక్ దవాఖాన మొత్తం తిరిగారు. తన భార్యను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. కానీ అప్పటికే సూపరింటెండెంట్ గదిలో బర్త్‌డే వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన వైద్య సిబ్బంది అతడి గోడును పట్టించుకోలేదు. చివరకు బాధితుడు ఓ ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేయడం, ఆయన అనుచరులను పంపించడంతో అర్ధరాత్రి తర్వాత బాధితురాలిని జీజీహెచ్‌లో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు.
జీజీహెచ్‌లో బిద్యానాయక్ అవస్థలకు సంబంధించిన వీడియో శనివారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, దాన్ని లైట్‌గా తీసుకున్న వైద్య సిబ్బంది తాము అనుకున్నట్లుగానే ప్రతిమారాజ్ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవం గా నిర్వహించారు. మేడమ్ చాంబర్‌ను ఫంక్షన్‌హాల్‌గా తీర్చిదిద్ది కేక్ కట్ చేయించారు. దవాఖాన సిబ్బంది మొత్తం ప్రతిమారాజ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు, గిఫ్ట్‌లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. వారంతా విధులు విస్మరించి వేడుకల్లో నిమగ్నం కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బర్త్‌డే వేడుకలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడంతో రోగులు, బంధువులు వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. ఒకవైపు రోగులు ప్రాణాపాయంలో ఉంటే ఇలా విధులు ఎగ్గొట్టి వేడుకల్లో పాల్గొనడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, జీజీహెచ్‌లో వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలంటే ఇంట్లో, ఫంక్షన్‌హాళ్లలో చేసుకోవాలి కానీ దవాఖానలో జరుపుకోవడం, రోగులను గాలికొదిలేసి సెలబ్రేషన్స్‌లో నిమగ్నం కావడమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వివరణ కోరేందుకు యత్నించగా, ఆమె స్పందించలేదు.