లింగంపేట, జూలై 19: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యాధికారిణి హిమబిందుకు సూచించారు.
పరిసరాల అపరిశుభ్రంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డయేరియా, పైలేరియా, డెంగీ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. మండలంలో విష జ్వరాలు అధికంగా వస్తున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, సర్వేలో లార్వా, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నట్లు మండల వైద్యాధికారి హిమబిందు డీఎంహెచ్‌వోకు వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రతి ఇంటికీ తిరిగి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని తహసీల్దార్ నరేందర్ స్థానిక వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రత్యేక అధికారి రాజుతో కలిసి తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో నరేశ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. లింగంపేట మండలంలో డెంగీ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.
ప్రైవేటు దవాఖానలను కూడా నిత్యం సందర్శించాలన్నారు. వైద్య సిబ్బంది సర్వే కోసం గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సంఘాల అధ్యక్షుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంచాయతీల నుంచి వైద్య సిబ్బందికి బ్లీచింగ్ పౌడర్ అందించాలని పలువురు ఏఎన్ఎంలు అధికారులను కోరగా.. పంచాయతీ కార్యదర్శుల నుంచి తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, ఏపీఎం చామంతి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌తోపాటు వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.