నిజామాబాద్, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పురపాలక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాలతో సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు ముఖ్య నేతలంతా కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముచ్చెమటలు పెట్టించే విధంగా క్షేత్ర స్థాయిలో గులాబీ సైన్యం పని చేస్తోంది. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు గులాబీ పార్టీ నేతలంతా కృషి చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను క్రోడీకరించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే అద్భుతమైన ఫలితాలు రాబట్టేందుకు పని చేస్తున్నారు.
కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటుగా ఆర్మూర్, బోధన్, భీంగల్ పురపాలక పీఠాలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు నేతలంతా రంగంలోకి దిగారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలనే ఎంపిక చేసి బరిలోకి దింపుతున్నారు. ఆర్మూర్‌లో వరుసగా గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ఆశన్నగారి జీవన్ రెడ్డి చురుగ్గా వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. బోధన్‌లో షకీల్ దంపతులు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ దూసుకు పోతున్నారు. నిజామాబాద్ నగరంలో మరోసారి సత్తా చాటేందుకు బిగాల గణేశ్ గుప్తా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ-ఫామ్‌లు పొందేందుకు అంతటా ఆశావహులు పోటీ పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో గులాబీ హవా..
కామారెడ్డి జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి పురపాలక సంఘం లో వరుసగా మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగిరేసేందుకు ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ ప్రణాళికలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్‌తో సమన్వయం చేసుకుంటూ కార్యరంగంలో దూసుకు పోతున్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీతో బలంగా తలబడే నాయకులకు కౌన్సిలర్ టికెట్లు కేటాయించి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలకు ముచ్చెమటలు తెప్పిస్తున్నారు. మైనార్టీ ఏరియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునేందుకు గంప గోవర్ధన్ పాటు పడుతున్నారు.
ఎల్లారెడ్డిలోనూ సగానికి ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ జెండాను మరోసారి ఎగిరేసేందుకు జాజాల సురేందర్ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. బాన్సువాడలో పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి పురపాలక ఎన్నికల ద్వారా గట్టి సమాధానం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు బలంగా పని చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో బాన్సువాడ పట్టణానికి జరిగిన మేలును, అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేస్తూ జనాల్లోకి దూసుకు పోతున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ నేతలంతా కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించేందుకు భారీగా ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఎన్నికలను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సవాల్‌గా తీసుకుని పని చేస్తున్నారు.
అధికార దుర్వినియోగంపై పోరు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడింది. గ్రామాల్లో అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తి మూలంగా అనేక చోట్ల బీఆర్ఎస్ మద్ధతుదారులు సునాయాసంగా విజయం సాధించారు. అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడినప్పటికీ ప్రజలంతా అవేవి లెక్క చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన నేతలకే పట్టం కట్టి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ పోరులో కారు గుర్తుతో ప్రజల్లోకి బలంగా వెళ్లి వారి మద్ధతును కూడగట్టేందుకు బీఆర్ఎస్ నేతలంతా ప్రయత్నాలు మొదలు పెట్టారు. పదేళ్లలో పట్టణాలు, నగరాల్లో జరిగిన అభివృద్ధిని తారకమంత్రంగా జనాల్లోకి చొచ్చుకెళ్తున్నారు.
అడుగడుగునా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోన్న కాంగ్రెస్ పార్టీ నేతల తీరును ఎదుర్కొంటూనే పోరాటం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, రెవెన్యూ, ఎన్నికల యంత్రాంగం తీవ్ర విమర్శలకు గురైంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రజా ప్రతినిధులు చెప్పినట్లుగానే పోలీసులు నడుచుకున్నారు. భారీ తతంగానికి తెరలేపి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారారు. పురపాలక ఎన్నికల్లోనూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడేందుకు అవకాశాలు మెండుగా ఉండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పని చేయని పక్షంలో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వ్యూహం రచించింది.